ఓవైసీ సహా ఎవరు అడ్డుపడినా.. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు ఆగదు: బండి సంజయ్ ఫైర్

by Ramesh Naini |

భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

ఓవైసీ సహా ఎవరు అడ్డుపడినా.. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు ఆగదు: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ (Bandi Sanjay) రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బండి సంజయ్‌ను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు బిల్లు పై మజ్లిస్ నేత ఓవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని, ఓవైసీ లాంటి ఎంత మంది వచ్చినా (Waqf Board Amendment Bill) వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆరోపించారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. దేశం ప్రజల కోసం మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు. వక్ఫ్ బోర్డు పేరు తీరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసన్నారు.

ఈ కరీంనగర్ లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుంచి ఇంటిని నిర్మించుకున్నారని, వాళ్ల తాత, ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయని, అందుకే దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సవరణ బిల్లు రూపొందించినట్లు వెల్లడించారు. దీనిని మతం కోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకిక వాదులు చూస్తున్నారని, ఒవైసీ సహా కుహానా లౌకిక వాదులు ఎవరు అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు.. దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్న.. 109 కేసులు నాపై ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే న్యాయవాదుల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుంచి మరో రూ.50 లక్షల సాయం చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

Next Story