ఓ వ్యక్తి కోసం నిబంధనలు మారవు.. రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
ఓ వ్యక్తి కోసం నిబంధనలు మారవు.. రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే (గోషామహల్) రాజాసింగ్ (Raja Singh) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్పందించారు. శనివారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్ (శత్రు ఆస్తులు)పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఇచ్చిన సూచనలు, ఆదేశాల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండలం, బూత్ స్థాయి కమిటీలు నిర్ణయిస్తారని తెలిపారు. ఒక పద్ధతి, నియమ నిబంధనల ప్రకారం కమిటీలు వేస్తారని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, ఓ వ్యక్తి కోసం పార్టీ నిబంధనలు మార్చరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బాధ పడి ఉండొచ్చు నేను కాదనను.. రాజాసింగ్ చాలా మంచి నాయకుడు, హిందూ ధర్మం కోసం పనిచేసే నాయకుడు అని కొనియాడారు. కొంత మంది ఆయనను రెచ్చగొట్టారని, ఆయనను రెచ్చగొట్టొద్దని సూచించారు.

మోడీ కులం, రాహుల్ మతంపై చర్చకు సిద్ధమా?

ప్రధాని మోడీ (PM Modi)ది ఏ కులం? రాహుల్ గాంధీ (Rahul Gandhi)ది ఏ మతం అనే అంశాలపై చర్చకు తాము సిద్ధమని, ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళదామా? అంటూ కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్ విసిరారు. కుల గణన తప్పుల తడక, బీసీ జాబితాలో ముస్లింలను కలపడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ప్రధాని కులంపై సీఎం రేవంత్ అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి రిజర్వేషన్ల జాబితాను కేంద్రానికి పంపితే ఆమోదించే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ఈ విషయం తెలిసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి పంపితే కేంద్రాన్ని ఒప్పిస్తానని తేల్చిచెప్పారు.

Advertisement
Next Story