కేటీఆర్ నోటీసులకు నేనెందుకు భయపడత?: బండి సంజయ్

by Disha Web Desk 2 |
కేటీఆర్ నోటీసులకు నేనెందుకు భయపడత?: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని, ఈ వ్యవహారంలో ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ‌మీద తాను చేసిన వ్యాఖ్యలకు లీగల్‌గా నోటీసులు ఇచ్చినట్లు తెలిసిందని, డిఫమేషన్ కేసు పెడుతున్నట్లు సమాచారం అందిందని ఉదహరించిన ఆయన ఢిల్లీ నుంచి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, చట్టపరంగా తగిన సమాధానం ఇస్తానని, ఈ నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పుడు, మంత్రిగా ఆయనకు దానితో సంబంధమే లేనప్పుడు దాని తరఫున ఆయన ఎలా మాట్లాడతారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నోటీసులను రాజకీయంగానూ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటానని అన్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నాకు లీగల్ నోటీసు పంపినట్లు వార్తలు ప్రసారమవుతున్నాయి. ఈ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. చట్ట, న్యాయబద్దంగా తగిన సమాధానమిస్తా. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతా. కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ట్విట్టర్ టిల్లును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ తనదైన శైలిలో ఢిల్లీ నుంచి ప్రకటనను విడుదల చేశారు. టీఎస్పీఎస్సీతో సంబంధమే లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్ అంటూ అభివర్ణించిన సంజయ్... ఆయనది నాలుకా? తాటిమట్టా? అని కామె,ట్ చేశారు. ఏ సంబంధమూ లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారని అన్నారు. లీకేజీ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని ఎట్లా ఆరోపిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల తరపున వకాల్తా పుచ్చుకుని ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉంటూ ట్విట్టర్ టిల్లు స్పందిస్తే తప్పు లేనప్పుడు ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా తాము మాట్లాడితే తప్పేముందన్నారు. ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సాంప్రదాయానికి ట్విట్టర్ టిల్లు తెరలేపడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలో భాగమే ఇది అని అన్నారు.

వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బెదిరించడం, కేసులు పెట్టడం, తమ తాబేదారు సంస్థలతో నోటీసులు ఇప్పించడం, అరెస్ట్ చేయించడం కేసీఆర్ సర్కార్‌కు ఒక అలవాటుగానే మారిందన్నారు. వీటికి భయపడే ప్రసక్తే లేదని, చట్ట, న్యాయపరంగానే ఆ నోటీసులకు తగిన సమాధానమిస్తామన్నారు. రాజకీయంగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సీఎం పది వేల సాయంలో 75% కేంద్రానిదే

అకాల వర్షాలతో పంటలకు జరిగిన నష్టానికి రైతులకు కేంద్రం పైసా సాయం చేయడంలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్దమని బంచి సంజయ్ వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పుకోవడం, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సొంత నిధులతోనే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధుల నుండి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తోందని, ఆ నిధుల్లో 75% వాటా కేంద్రానిదేనన్నారు. అయినా సిగ్గు లేకుండా కేంద్రం పైసా ఇవ్వలేదని చెబుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారనే సోయి కూడా వ్యవసాయ శాఖ మంత్రికి లేదన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం బాగలేదని చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ పథకం ద్వారా సాయం అందకుండా రైతుల నోట్లో ఎందుకు మట్టికొట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను దారి మళ్లించేందుకే జాతీయ సమగ్ర పంటల విధానాన్ని రూపొందించాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది ఏళ్లయినా ఇంతవరకూ సమగ్ర పంటల విధానాన్ని, బీమా పాలసీని తీసుకురాకుండా కేంద్రంపై బురద చల్లడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.


Next Story

Most Viewed