‘గందరగోళం సృష్టిస్తే తెలంగాణకే నష్టం’.. కేంద్రమంత్రికి రాసిన లేఖను రివీల్ చేసిన బండి సంజయ్

by Gantepaka Srikanth |

ఎయిమ్స్ తరహాలో తెలంగాణలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను స్థాపించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​స్పష్టం చేశారు.

‘గందరగోళం సృష్టిస్తే తెలంగాణకే నష్టం’.. కేంద్రమంత్రికి రాసిన లేఖను రివీల్ చేసిన బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎయిమ్స్ తరహాలో తెలంగాణలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను స్థాపించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​స్పష్టం చేశారు. ఆయుర్వేదం ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ జరిగే ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్యాలు లీకులిస్తూ కేంద్రంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ, ప్రాంతాలూ సమానమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సైతం సమాచారమిచ్చామని ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్‌కు రాసిన లేఖను కూడా విడుదల చేశారు. అదే విధంగా కరీంనగర్‌లో అత్యాధిక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ దామోదర రాజనర్సింహాకు తాను నాలుగు నెలల క్రితం లేఖ రాశానని, ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

తెలంగాణలో సాంప్రదాయ ఆయుష్ వైద్యసేవలు, విద్యా అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయుర్వేద చికిత్సలపై స్థానికంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సంస్థాగత స్థాయిలో ఆయుర్వేద సేవలు లభ్యం కావడం లేదు. ఆసుపత్రికి అనుబంధంగా ఉండే కళాశాల ఏర్పడితే ప్రజలకు ఆయుర్వేద చికిత్సలను మరింతగా అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. ప్రస్తుతం అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు, నిపుణులు కొరత ఉంది. కొత్త కళాశాల ఏర్పాటు ద్వారా నూతన తరానికి శిక్షణ కల్పించడమే కాకుండా, స్థానిక ఆరోగ్య వ్యవస్థ బలపడుతుంది. దీనికితోడు ఆయుర్వేద విద్యను అభ్యసించాలంటే తెలంగాణ విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. స్థానికంగా కళాశాలను ఏర్పాటు చేయడంతో వారికి అందుబాటు ధరల్లోనూ విద్యా అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఆయుర్వేద వైద్య సేవలు ప్రజలకు ఎంతో అవసరం :

తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్థాపనతో రాష్ట్రానికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరనుందని అభిప్రాయపడ్డారు. అధిక ప్రమాణాల ఆయుర్వేద వైద్య సేవలను అందించడం ద్వారా, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించినట్లు భారతీయ సాంప్రదాయ వైద్య విద్యా పరిశోధనలను అభివృద్ధి చేయడం ద్వారా, ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందన్నారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆయుష్ మంత్రికి ఇటీవల లేఖ రాశానని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అతి త్వరలోనే ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, గోవా తరహాలోనే తెలంగాణలోనూ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

Next Story