Bandi Sanjay: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్

by Prasad Jukanti |   (  Updated:2025-11-19 08:57:37  IST  )

అర్బన్ నక్సలైట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Bandi Sanjay: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో/హుజురాబాద్ రూరల్: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే (Urban Naxalite) వారి చావులకు కూడా బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్‍కు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

అదే నిజమైంది:

అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకం అని బండి సంజయ్ అన్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఈ విధానాన్ని ప్రజలు హర్షించబోరని తాము చెబుతూ వచ్చామని ఈ రోజు అదే నిజమైందన్నారు. కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ అని ఆరోపించారు. చనిపోయిన కుటుంబాలకు ఏం జవాబు చెబుతారు? పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్ కు తెలియదా? అని ప్రశ్నించారు.

నా మాటకు ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నా:

అర్బన్ నక్సలైట్లు, పౌర హక్కుల సంఘం నాయకులను అడుగుతున్నా... పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కదా? మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎట్లా భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. వాటిని అమలు చేశారా? అలాంటప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని చెప్పానని ఇప్పటికీ తాను ఈ మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్ధిక ప్రగతిలో భారత్‍ను 4వ స్థానానికి చేర్చిందని బండి సంజయ్ చెప్పారు.

మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా?:

అడవులో ఉన్న మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా.... అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అమిత్ షా (Amit Shah) ఒక్క మాట ఇస్తే తప్పరని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు. దయచేసి మావోయిస్టులంతా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహాయం అందిస్తున్నాయని, ప్రజల మధ్యలో సంతోషంగా జీవించవచ్చన్నారు. నక్సలిజాన్ని సమర్ధించిన వాళ్లు కూడా నేరస్తులేనని. మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధనీయమా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Next Story