Bandi Sanjay : ఈ మూడు అంశాలే మన ఎజెండా.. మున్సిపల్ ఎన్నికలపై బండి బిగ్ ప్లాన్

by Prasad Jukanti |

కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేస్తామని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay : ఈ మూడు అంశాలే మన ఎజెండా..  మున్సిపల్ ఎన్నికలపై బండి బిగ్ ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే మన్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ సికింద్రాబాద్‍లోని క్లాసిక్ గార్డెన్‍లో జరిగిన ‘బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తేస్తామన్నారు. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ (Congress) రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ దోస్తీ:

బీఆర్ఎస్ కు (BRS) ఓటేస్తే గెలిచిన వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళతారని కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్‍లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ (AIMIM) దోస్తీ కట్టిందన్నారు. బీజేపీ గెలిచే చోట ఓట్లను తారుమారు చేసి మజ్లిస్‍కు అధిక సీట్లు వచ్చేలా డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులను నమ్ముకుని గెలవాలనుకుంటుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళుతోందన్నారు.

మూడు అంశాలే బీజేపీ ఎజెండా:

అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం ఈ మూడు అంశాలే బీజేపీ (BJP) ఎన్నికల ఎజెండా అని బండి సంజయ్ అన్నారు. ఇక నుండి పోలింగ్ జరిగే వరకు ఒక్కో ఇంటికి 6 సార్లు వెళ్లాలని శ్రణులకు దిశానిర్దేశం చేశారు. వార్డుల వారీగా సమస్యలున్న చోటకే వెళ్లి భరోసా ఇవ్వాలని సూచించారు.

Next Story