బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలే : బండి సంజయ్ కుమార్

by Muthe.Rajitha |

బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేనని మరోసారి స్పష్టమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలే : బండి సంజయ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేనని మరోసారి స్పష్టమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం నిపుణుల అంచనా కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదకుడికి కొన్ని కీలక సూచనలు చేసిందని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇందుకోసం కేంద్రీయ జల కమిషన్ (సీడబ్ల్యూసీ )తో సంప్రదింపులు జరిపాలని సూచించిందని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

అంతేకాకుండా, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధిత అంత:ర్రాష్ట్ర అంశాలపైనా సీడబ్ల్యూసీ పరిశీలన జరిపి, అవసరమైన అనుమతులు పొందిన తరువాతే పర్యావరణ ప్రభావ అధ్యయనానికి నిబంధనల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను రూపొందించే ప్రతిపాదనను ఈఏసీ ముందు సమర్పించాల్సిందిగా సిఫార్సు చేసిందని తెలిపారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన మొదటి నుండి తాము ఇదే చెబుతున్నామన్నారు. అయినా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి విష ప్రచారం చేశాయన్నారు.

బనకచర్ల విషయంలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని నిన్నటిదాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యూ టర్న్ తీసుకున్నాయన్నారు. కేంద్ర నిర్ణయం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని, మంచి జరిగితే తమదే క్రెడిట్ అంటూ జబ్బలు చరుచుకునే ఈ పార్టీల నేతలు చెడు జరిగితే ఇతరులపై నెట్టేయడం అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఝులు అని, ఈ విషయంలో అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం తథ్యం అని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

Next Story