ఇండియాలోని పాకిస్తాన్ ఆస్తులపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-15 09:59:33  IST  )

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay ) కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియాలోని పాకిస్తాన్ ఆస్తులపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay ) కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్ (Enemy Properties)పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్‌పై సమీక్ష నిర్వహించాం. రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్(శత్రు ఆస్తులు) ఉన్నాయి. చాలా ఆస్తులు ఆక్రమణలు జరిగాయి. వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా పొజిషన్‌లో ఉన్న సామాన్య ప్రజలు, రైతులకు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలేమిటి? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే, రికార్డ్స్ పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరాము.

గతంలో పాకిస్తాన్‌తో యుద్ధం సందర్భంగా ఇండియా(India) నుండి పాకిస్తాన్(Pakistan) వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అట్లాగే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారు. అయితే ఆ ఆస్తులు పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎనిమీ ప్రాపర్టీస్‌ను కూడా అమ్మేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని నిర్ణయించాం. తెలంగాణలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయని అంచనా వేస్తున్నాం. మార్చి నెలాఖరులోపు ఆయా ఆస్తులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాం’ బండి సంజయ్ అన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తుంటే వాటిపై చర్చ చేయకుండా, సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, రైతు భరోసా, రేషన్ కార్డులు, పెంచి ఇస్తామన్న పింఛన్లు, తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2500 ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 50 వేల మందికి ఉద్యోగాలిచ్చినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

‘కాంగ్రెస్ కులగణన(Caste Census) సక్రమమైతే రీ సర్వే ఎందుకు చేస్తున్నారు? ప్రశ్నించారు. తెలంగాణలో 3 కోట్ల 95 లక్షల ఆధార్ కార్డులున్నట్లు నివేదికలున్నయ్. ఆధార్ తీసుకోని వారి శాతం మరో 10 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ జనాభా 4 కోట్ల 30 లక్షలు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన సర్వే చేసి 3 కోట్ల 70 లక్షల జనాభా ఉన్నట్లు తేల్చడమేంది? మిగిలిన 60 లక్షల మంది ప్రజలేమైపోయారు? కాంగ్రెస్ చంపేసిందా? మీకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి కుల గణన చేయాలి. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి కేంద్రానికి పంపాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story