Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా మీ తీరు మారదా? సీఎంపై బండి సంజయ్ ఫైర్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా మీ తీరు మారదా? సీఎంపై బండి సంజయ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పనిచేసే ఔట్ సోర్సింగ్ (Municipal Out sourcing) శానిటేషన్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు నెల వేతనం రూ.22 వేలు చెల్లిస్తుండగా, ఆ వేతనాన్ని రూ.16,600లకు తగ్గించడం దారుణం అన్నారు. డ్రైవర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లకు 25 శాతానికిపైగా వేతనాలు తగ్గించడం కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య అన్నారు. మున్సిపాలిటీల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు తగ్గించిన ప్రభుత్వ నిర్ణయంపై ఇవాళ బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.

సీఎం గారు.... ఇదేం పాలన?:

పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం అని కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వారందించిన సేవలు మరువలేనివని బండి సంజయ్ అన్నారు. అలాంటిది వారికి వేతనాలు పెంచాల్సింది పోయి డ్రైవర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లకు వేతనాలు తగ్గించడంపై మండిపడ్డారు. పెంచాల్సిన వేతనాలను తగ్గించడమేంటి? ఇదేం పాలన సీఎం గారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం ఏంటని మండిపడ్డారు. నాలుగేళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఎందుకు పెంచడం లేదు? తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటరీ ఇన్ స్పెక్టర్లు, డ్రైవర్ల వేతనాల్లో భారీగా కోత విధించడాన్ని చూస్తుంటే ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపట్ల కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేక భావం అర్ధమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, అన్నీ గమనిస్తున్నారు. తక్షణమే చేసిన పొరపాటును సరిదిద్దుకుని మున్సిపల్ డ్రైవర్లు, శానిటేషన్ వర్క్ ఇన్ స్పెక్టర్ల వేతనాలను సరిచేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ వేతనాలను పెంచాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Next Story