- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించండి’.. CM రేవంత్‌కు బండి సంజయ్ విజ్ఙప్తి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet)లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. అలాంటి మంత్రులను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులను చంపినా, హత్యాయత్నం చేసే స్థాయికి పెట్రేగిపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills)లో ఒకవర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
సర్దార్ వల్లభాయి పటేల్(Sardar Vallabhbhai Patel) 150 జయంతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌లోని మేరా యువ భారత్ కార్యాలయంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ ఐక్యత కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్ జన్మించి ఈనెల 31 నాటికి 150 ఏళ్లు. సర్దార్ వల్లభాయి పటేల్ ఆనాడు దేశంలోని 560 సంస్థానాలను ఒక్క జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేశారు. భారత్ తోనే కాదు... తెలంగాణతోనూ ఉన్న అనుబంధం గురించి ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదు. తెలంగాణను పాకిస్తాన్‌లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసిండు. ఒకవేళ తెలంగాణ భారత్‌లో విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించండి. మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. ఇది ఆనాడే గ్రహించిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని ప్రకటించి నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడు.
అలాంటి మహనీయుడిని 150 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా, ఆయన సిద్దాంతాలను ప్రజల్లోకి విస్ర్తతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ పేరిట అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో విద్యార్థులను, యువతతో కలిసి పాదయాత్రలు చేయాలని సంకల్పించింది. సర్దార్ పటేల్ జన్మస్థలమైన కరంసాద్ నుండి స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ (కేవాడియా) వరకు మొత్తం 152 కి.మీ.ల మేరకు జాతీయ పాదయాత్ర (నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు) నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోడీ ఒకరోజు జాతీయ పాదయాత్రలో పాల్గొంటారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ పేరిట జరిగే పాదయాత్రలో నేనూ పాల్గొంటాను. సర్దార్ పటేల్ ఈ కార్యక్రమాలకు విస్త్రత ప్రచారం కల్పించి యువతలో ఐక్యతా స్పూర్తిని నింపాలని మీడియాను, సోషల్ మీడియా వారియర్స్‌ను కోరుతున్నా.
రాష్ట్ర కేబినెట్‌లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రిపూట ఇండ్లకు, ఆఫీసులకు పిలిపించుకుని వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న మహిళలను గౌరవించాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం సరికాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలి. బాధ్యులైన మంత్రులను బర్త్ రఫ్ చేయాలి.
ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటేనే మహిళలు అసహ్యించుకునే పరిస్థితి ఉంది. అవినీతి, అరాచకాలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. ముఖ్యంగా మహిళలకు ప్రతినెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానని మోసం చేశారు. వీటికి తోడు శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. సాక్షాత్తు పోలీసులపై దాడులు చేస్తున్నరు. మొన్న నిజామాబాద్‌లో మజ్లిస్ రౌడీషీటర్ కానిస్టేబుల్‌ను చంపేశారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున డీసీపీ చైతన్య, కానిస్టేబుల్‌పై ఎంఐఎం రౌడీషీటర్ దాడి చేసి హత్యాయత్నం చేసినా దిక్కు లేదు. గోరక్షులపై కాల్పులు జరిపి చంపేందుకు యత్నిస్తున్నారు. మేం బాధితులకు అండగా వెళ్లి పోలీసులను పరామర్శిస్తే.. మజ్లిస్ నేతలు మాత్రం రౌడీషీటర్లను పరామర్శిస్తూ వారికి కొమ్మ కాస్తున్నారు. ఎంఐఎం ఓట్ల కోసం జూబ్లీహిల్స్‌లో గెలవడానికి ఆ పార్టీ కాళ్లు మొక్కుతున్నారు. ఆనాడు బీఆర్ఎస్ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కాళ్లు మొక్కిన దుస్థితి. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయే శాంతి భద్రతలు పట్టడం లేదు. అందుకే ఆ పార్టీల కోసం ఒవైసీ బిహార్‌ను వదిలి జూబ్లీహిల్స్‌లో తిష్టవేసి ముస్లిం ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు.
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయం మానుకోవాలి. డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్‌పై కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాలి. యూపీ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలి. అక్కడ రౌడీషీటర్లకు బెయిల్ వచ్చినా బయటకు రాకుండా జైల్లోనే ఉండే పరిస్థితి. అట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీషీటర్లను కంట్రోల్ చేయాలి.
దురద్రుష్టం ఏమిటంటే... రాష్ట్ర ముఖ్యమంత్రే నక్సలిజం నా ఫిలాసఫీ అంటారు. ఒవైసీ మంచోడని అంటారు. అక్బరుద్దీన్ ఒవైసీ కొడంగల్‌లో పోటీ చేస్తే గెలిపిస్తానని అంటారు. హైదరాబాద్ నడిబొడ్డున డీసీపీపై హత్యాయత్నం జరిగినా పట్టించుకోరు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎం వద్ద మోకరిల్లుతున్నరు. ఇది సరికాదు. శాంతిభద్రతలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.






