మోడీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్.. ఖర్గేపై బండి సంజయ్ ఫైర్

by Prasad Jukanti |

మోడీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్.. ఖర్గేపై బండి సంజయ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని పిలవడం రాజకీయమే కాదు ఓటమిని అంగీకరించలేని నైరాశ్యం అని ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలు మోడీకి పదే పదే మద్దతు తెలిపిన ఓటర్లను అవమానించడమేనన్నారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా బండి సంజయ్ ఓ పోస్టు చేశారు. కాంగ్రెస్ బ్యాలెన్స్ కోల్పోయి రాజకీయ దాడి మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య ఆత్మ దాడికి పాల్పడుతోందని దుయ్యబట్టారు.

ఉగ్రవాదుల కోసం కన్నీరు పెట్టుకున్నారు:

ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చి మన సైన్యం ధైర్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి భాష మాట్లాడటం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దశాబ్దాల పాటు ఉగ్రవాదంతో దేశం రక్తమోడేలా చేసిన కాంగ్రెస్, ప్రధాని మోదీ హయాంలో ఆ 'సాఫ్ట్ ఆన్ టెర్రర్' విధానం అంతం కావడంతోనే ఈ నిరాశలో ఉందని పేర్కొన్నారు.2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్‌ వంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పదేపదే శత్రువుల కథనాలను ప్రచారం చేసిందని, మన సైనికులనే ఆధారాలు అడిగిందని, దేశభావనలకు దూరంగా నిలిచిందని ఆరోపించారు. బీజేపీ సేవా రాజకీయాలను నమ్ముతుందని, దుర్భాషలను లేదా నిరాశను కాదని స్పష్టం చేశారు. ఖర్గే వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story