బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు

by Prasad Jukanti |

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి, బాధితురాలికి నోటీసులు జారీ చేసింది.

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ (Bandi Bhagirath) బెయిల్ పిటిషన్‍పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరింది. తనపై నమోదైన కేసు తప్పుడుదని, ఇదంతా పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా జరిగిన వ్యవహారమని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసుల విచారణకు సహకరిస్తున్నానని పేర్కొంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే నిందితుడి బెయిల్ అభ్యర్థనపై బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉన్నందున, ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

బెయిల్ ముగియడంతో ఇటీవల మళ్లీ జైలుకు:

కాగా ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో బండి బగీరథ్‍పై పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో మే 8న పోక్సో కేసు నమోదైంది. అనంతరం పరారైన భగీరథ్‌ను మే 16న పోలీసులు అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో తన ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు వీలుగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు భగీరథ్‍కు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. గత ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు మధ్యంతర బెయిలు లభించింది. అయితే బెయిల్ గడువు ముగియడంతో గత గురువారం తిరిగి అతడిని చర్లపల్లి జైలుకు అధికారులు తరలించారు. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రావడంతో ఎల్లుండి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story