- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మావోయిస్టు పార్టీలో అంచంలంచెలుగా ఎదిగిన బడే చొక్కారావు.. ఆ జిల్లాల్లో గట్టి పట్టు

దిశ, వరంగల్ బ్యూరో: మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు, అలియాస్ దామోదర్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధి పూజారి కంకేర్ - మారేడుబాక గ్రామ సమీప అడవుల్లో ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లుగా ఈ మేరకు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ శనివారం స్వయంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 18 మంది మావోయిస్టులను కోల్పోయినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ‘చనిపోయిన వీరులు తమ చివరి శ్వాస వరకు పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా కామ్రేడ్ బడే చొక్కారావు (దామోదర్ దాదా) ధైర్యసాహసాలను ప్రదర్శించి, పోరాడుతూ అమరుడయ్యాడు. అతని మరణం సంస్థకు కోలుకోలేని నష్టాన్ని కలిగించింది. అయితే అతని విప్లవాత్మక వారసత్వం వేలాది మంది కొత్త సహచరులకు స్ఫూర్తినిస్తుంది’ అంటూ లేఖను విడుదల చేశారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో అనేక ఆపరేషన్లు నిర్వహించిన ఆయన ఉద్యమంలోనే తుది శ్వాస విడించారు. దామోదర్ భార్య ఇట్టి నర్సక్క అలియాస్ సబితక్క 2011లో చర్ల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది.
30 ఏళ్లుగా ఉద్యమంలోనే..
గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ వస్తున్న చొక్కారావు.. పార్టీలో అంచలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. చొక్కారావు ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉంటూ వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చొక్కారావుపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించగా.. తెలంగాణ రాష్ట్రం సైతం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. దామోదర్‌ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి. ఆయన సోదరుడు బడే నాగేశ్వర్ రావు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు. 2008లో బడే నాగేశ్వర్‌రావు దంపతులు తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సోదరుడు నాగేశ్వర్ రావు అడుగు జాడల్లోనే విప్లవ బాటలో దామోదర్ నడిచారు. 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన దామోదర్ ఏటూరునాగారం ఏరియా కమిటీలో చేశారు. ఏటూరునాగారం ఎస్టీ హాస్టల్‌లో పదో తరగతి వరకు చొక్కారావు చదువుకున్నారు. ఈ ప్రాంతంపై దామోదర్ గట్టి పట్టు సాధించారు. మూడుదశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, యాక్షన్ టీం కమాండర్‌గా వ్యవహరించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ కరోనాతో మరణించడంతో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అతడి స్థానంలో బడే చొక్కారావుకు 2021లో బాధ్యతలు అప్పగించింది.
పోలీసులకు సవాల్..!
తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందు కరీంనగర్, ఖమ్మం, వరంగల్(కేకేడబ్ల్యూ) డివిజన్ కమిటీ కార్యదర్శిగా దామోదర్ పనిచేశారు. అనంతరం 2016-17లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్‌ను ఏర్పాటు చేసి, దానికి కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2019లో జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి బాధ్యతల నుంచి పార్టీ తప్పించి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. రాష్ట్ర యాక్షన్ టీమ్ కమిటీ కమాండర్‌గా పదోన్నతితో నియమించింది. ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దామోదర్‌కు గట్టి పట్టుండటంతో పోలీసులకు పలుమార్లు సవాల్ విసిరారు. పార్టీని నిలబెడుతాడనే అంచనాల మధ్య మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా నియమించింది. అందుకు తగ్గట్టుగానే మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించేందుకు దామోదర్ అనేక ప్రయత్నాలు చేశారు.