కాంగ్రెస్ ఎంపీలకు సొంత పార్టీ నుంచే చీవాట్లు

by Naga Rani Yarlagadda |

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ ఎంపీలకు సొంత పార్టీ నుంచే చీవాట్లు
X

దిశ,తెలంగాణ బ్యూరో : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానపరుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండటం ఏంటని మండిపడుతున్నారు. ఆయన మాటలను వెంటనే ఖండించేందుకు ఎంపీలు చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. గురువారం లోకసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వీ రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చారు. ఆ సమయంలో రాష్ట్రానికి చెందిన 8మంది కాంగ్రెస్ ఎంపీలు సభలోనే ఉన్నారు. కానీ ఎవరూ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. బీజేపీ ఎంపీ కామెంట్స్‌పై బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా స్పందించింది. ఏకంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు రంగంలోకి బీజేపీ ఎంపీ మాటలను ఖండించారు. కానీ పార్లమెంట్‌లోనే కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మరుసటిరోజు స్పందించారు. తేజస్వీపై యాక్షన్ తీసుకోవాలంటూ పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. అయితే ముందు రోజు మౌనంగా ఉన్న ఎంపీలు 24 గంటల తరువాత మేల్కొనడానికి కారణం సొంత పార్టీ నేతలు, తెలంగాణవాదులు ఫోన్ చేసి చీవాట్లు పెట్టడమేనని ప్రచారం జరుగుతున్నది.

Next Story