గూడేలకు చెరగని గురుతు బి.డి.శర్మ

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-12-08 00:45:59  IST  )

స్వతంత్ర భారత దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా. బి. డి. శర్మ. బ్రాహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు...

గూడేలకు చెరగని గురుతు బి.డి.శర్మ
X

స్వతంత్ర భారత దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా. బి. డి. శర్మ. బ్రాహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో 1929లో పుట్టిన బ్రహ్మ దత్త శర్మ కష్టపడి చదివి ఐ. ఎ. ఎస్ గా వివిధ శాఖలలో పనిచేసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్ అయ్యారు. 1996లో షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం (ఫెసా) రావటానికి, దాని నియమాలు రూపొందించిందీ శర్మనే. దిలీప్ సింగ్ భూరియా కమిటీకి అసలు ఆదివాసీ ప్రాంతాలలో పెసా అంటే 'మావనాటే మావ సర్కార్' అంటే మా వూళ్లో మా రాజ్యం, మా గూడెంలో మా పరిపాలన అని నినదించారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతో సహజీవనం చేసిన అనుభవంతో దీనిని గ్రహించారు.

ఆదివాసీలకు నీరు, అడవి, భూమి (జల్-జంగల్-జమీన్)వారి నివాస ప్రాంతంపై స్వయం నిర్ణయం హక్కు కావాలని పరితపించి దిలీప్ సింగ్ భూరియా కమిటికి తాను స్వయంగా రిపోర్టు తయారు చేసి, ఆదివాసి స్వయం పాలన హక్కుకై పార్లమెంటులో ప్రయివేట్ బిల్లు పెట్టించి పాస్ చేయించటంలో బి.డి. శర్మ కృషి కీలకం. 1958లో బస్తర్ కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు నాటి బస్తర్ అనుభవంతో ఆదివాసీలను చేరదీశారు. నాడు బస్తర్ నేడు 7 జిల్లాలుగా అంటే సూక్ష్మ బీజాపూర్, సుక్మా, దంతెవాడ, ఉత్తర, దక్షిణ బస్తర్, బైలాడిల్లా, కాంకీర్లుగా విడిపోయింది. అంత పెద్ద ఆదివాసీ జిల్లాకు తొలిసారి కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు ఆదివాసీల ఆటవిక జీవనం, కడుదారిద్ర్యం స్వాగతం పలికింది. బస్తర్ పూర్తిగా ఆదిమ తెగలు గల కొండ ప్రాంతం. ప్రతీ ఆదివాసీకి కనీస వైద్యం, రోడ్డు సౌకర్యం, మంచినీరు అందించి వారి అభివృద్ధికి తోడ్పాలని ఒక కలెక్టర్‌గా కలలుగన్నాడు. అబూజ్ మాడ్ (కనిపించని కొండలు) లను సైతం కాలినడకన పగలనక రేయనక తిరిగారు. ఆదివాసీ జీవనాన్ని చక్కదిద్దాలని అభివృద్ధి నమూనాలు తయారు చేసి, కలలుగన్న శర్మకు, అభివృద్ధి స్థానంలో విధ్వంసం అనే ప్రగతి నమూనా రావడంతో తన కలలన్నీ నిర్వీర్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టటంతో పాటు ఆ కలెక్టర్‌కే అధికారికంగా ఉక్కు పరిశ్రమ చేపట్టాలని సూచించింది. కలగన్నది అభివృద్ధి నమూనా కాగా అది ఉక్కు పరిశ్రమతో విధ్వంస నమూనాగా మారింది. ఇనుప ఖనిజం తవ్వకం మొదలయితే ఆదిమ తెగలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని దీని నుంచి వచ్చే విషం కారణంగా అనేక మంది ఆదివాసీలు రోగాల బారినపడి మృత్యువాత పడతారని, దీంతో అమాయకులైన వారి మనుగడ ఇక ప్రశ్నార్ధకమేనని గ్రహించారు.

ప్రభుత్వ ఏజెంట్‌గా ప్రభుత్వం తరపునే నిలబడి ఉక్కు తవ్వకాలు చేపట్టాలి. కానీ ఒక కలెక్టర్‌గా తన అధికారాన్ని రాజ్యాంగబద్ధ నిబంధనలతో ఇది మానవహక్కులు, నిబంధనలకు వ్యతిరేకం అని, జీవించే హక్కుకు భంగకరమని అని, ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేపించాడు. ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేశాడనే నెపంతో బి.డి. శర్మను బస్తర్ వీధుల్లో బిజెపి పార్టీ నాయకులు అర్ధ నగ్నంగా చెప్పులు మెడలో వేసి ఊరేగించారు. అంత అవమానం జరిగినా బి. డి. శర్మ కుంగిపోలేదు. వాస్తవంగా బి.డి. శర్మ అబూజ్ మడ్‌లో ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మావోయిస్టుల కంటే ముందు కాలు పెట్టాడు. కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే అతని ఆశయానికి అడ్డు తగిలినవి. ఇటువంటి దురాగతాలను బి.డి. శర్మ ముందుగానే గ్రహించి తన జీవితాన్ని ఆదివాసీల కోసం ధారపోశారు.

మావోయిస్టులు బస్తర్ కలెక్టర్ వినీల్ కృష్ణను కిడ్నాప్ చేసి 18 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు, అనాటి ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా.. పోలవరం లాంటి ప్రాజెక్టు అయిన ఆగకపోతుందా అనే ఆశతో మావోయిస్టులతో మాట్లాడి ఒప్పించి, కలెక్టరును విడిపించటానికి దండకారణ్యానికి బయల్దేరాడు. కానీ, ప్రభుత్వం తన నీతిలేని బుద్ధిని నిరూపించుకుంది. కలెక్టర్ విడుదలయ్యాక ఏకంగా పార్లమెంట్ బిల్లు పెట్టి 5వ షెడ్యూల్, 170, ఎల్.టి.ఆర్ లాంటి చట్టాలకు విరుద్ధంగా పోలవరంని కట్టే ప్రక్రియను చట్టబద్దంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంటి దుర్మార్గాలను సైతం ఆపటానికి బి. డి. శర్మ చేసిన కృషి ఎనలేనిది. భారతదేశంలో బి.డి. శర్మ అనేక ఆదివాసీ ప్రాంతాలు పర్యటించి 76 పుస్తకాలు రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో బి.డి. శర్మ అనుబంధం మరువలేనిది. 1996 ఆగస్టు 6న ఆదివాసి స్వయంపాలన, ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం ఏర్పడ్డ 'తుడుందెబ్బ' గూడూరులో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే ప్రొ॥ బియ్యాల జనార్ధనరావు పిలుపు మేరకు బి.డి. శర్మ ఉద్యమ దిశా నిర్దేశాన్ని ప్రకటించారు. నిత్యం ఆదివాసీల సంక్షేమం కోసం పరితపించిన బి.డి. శర్మ 2015 డిసెంబర్ 8న కాలగమనం చెందారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ చైతన్యంతో దేశవ్యాప్తంగా ఆదివాసీ అభివృద్ధి సమూనాను సుస్థిరం చేసుకున్న రోజు, ఆదివాసి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను రక్షించుకున్న రోజు బి.డి. శర్మకు ఘనమైన నివాళి అవుతుంది.

(నేడు బి. డి. శర్మ వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక

94913 18409

Next Story