- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీ రంగానికి కూడా త్వరలో అవార్డులు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో : బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటీనటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో టీవీ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లుగా తెలిపారు.
చిత్రపురి సమస్యను తప్పక పరిష్కరిస్తానని, చిన్న నటులకు కూడా అందులో అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. మీరు ఓటు రూపంలో మాకు అండగా ఉండండి, మీకు కావలసిన సహాయాన్ని నేను భరోసా ఇస్తున్నట్లుగా కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే, ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
సినీ కార్మికులు, టీవీ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ మా ప్రభుత్వం అండగా ఉంటుందని, మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చుని ఆయన స్పష్టం చేశారు. సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీ కుటుంబ సభ్యునిగా అడుగుతున్నట్లుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి శ్రీధర్ బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టెలివిజన్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ముఖ్యంగా కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతా సమస్యలపై తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, వారి పట్ల సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా ఉన్నారని మంత్రి వివరించారు.
సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల అండగా ఉంటుంది : మహేష్‌కుమార్‌గౌడ్
మహేష్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందరిదని, సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల అండగా ఉంటుందన్నారు. నవీన్ యాదవ్ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటాడని పార్టీ టికెట్ ఇచ్చిందని, జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలిచి తీరాల్సిన అవశ్యకత ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఖజాను కొల్లగొట్టిందని, వాటాల పంపకాల తేడాతో ఆయన కూతురు కవిత రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సురేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.






