తెలంగాణలో ఆటో ఎల్పీజీ కష్టాలు.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

by Kema Shiva Kumar |

తెలంగాణలో తీవ్రమైన ఆటో ఎల్పీజీ గ్యాస్ కొరతపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.

తెలంగాణలో ఆటో ఎల్పీజీ కష్టాలు.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఆటో ఎల్పీజీ (Auto LPG) గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. రాష్ట్రానికి అదనపు ఎల్పీజీ సరఫరాను తక్షణమే పెంచాలని ఆయన కోరారు.

80 శాతం మార్కెట్ ప్రైవేట్ చేతుల్లోనే..

తెలంగాణలో ఆటో గ్యాస్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను మంత్రి తన లేఖలో వివరించారు. రాష్ట్రంలో సుమారు ఒక లక్ష ఎల్పీజీ ఆటో రిక్షాలు నడుస్తుండగా, గ్యాస్ సరఫరాలో ప్రభుత్వ రంగ సంస్థలైన IOCL, BPCL వాటా కేవలం 20 శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80 శాతం మార్కెట్ సూపర్ గ్యాస్, గో గ్యాస్ వంటి ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు, మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ప్రైవేట్ అవుట్‌లెట్‌లలో గ్యాస్ నిల్వలు అడుగంటిపోయాయని మంత్రి పేర్కొన్నారు.

రోజుకు 55 మెట్రిక్ టన్నుల కొరత

ప్రస్తుత సరఫరా పరిమితుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీ కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రైవేట్ బంకుల్లో గ్యాస్ దొరకక ఆటోలు రోడ్లపై నిలిచిపోతున్నాయని, ఇది ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, అత్యవసర ప్రాతిపదికన అదనపు కోటాను కేటాయించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story