ఆటోనే ఆయుధం.. రౌడీకి అడ్డుకట్ట.. ధైర్యవంతుడైన జాహెర్‌కు సీపీ సజ్జనార్ సన్మానం

by Ramesh Naini |

నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా ప్రాణాలకు తెగించి ఓ మహిళను రక్షించాడో సామాన్య ఆటో డ్రైవర్. తన ఆటోనే ఆయుధంగా మలచి, చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌ను నిలువరించి అసలైన పౌర ధర్మాన్ని చాటాడు.

ఆటోనే ఆయుధం.. రౌడీకి అడ్డుకట్ట.. ధైర్యవంతుడైన జాహెర్‌కు సీపీ సజ్జనార్ సన్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా ప్రాణాలకు తెగించి ఓ మహిళను రక్షించాడో సామాన్య ఆటో డ్రైవర్. తన ఆటోనే ఆయుధంగా మలచి, చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌ను నిలువరించి అసలైన పౌర ధర్మాన్ని చాటాడు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ భవనంలో ప్రత్యేకంగా సన్మానించి ప్రశంసా పత్రం, నగదు పురస్కారం అందజేశారు.

సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం..

మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరహా ప్రాంతంలో మంజు ఓమ్లతా అనే మహిళ తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. హిందీ మార్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే.. డబీర్‌పురకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. ఈ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ జాహెర్ సైడ్ మిర్రర్ ద్వారా ఈ దృశ్యాన్ని గమనించాడు. అప్పటికే 100 మీటర్లు ముందుకు వెళ్లిన అతడు.. వెంటనే ఆటోను వేగంగా వెనక్కి తిప్పి, పారిపోతున్న నిందితుడి బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. నిందితుడు కర్రతో దాడి చేసినా బెదరకుండా జాహెర్ ప్రతిఘటించాడు. అదే సమయంలో గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడిని పోలీసులకు పట్టించిన తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలి ద్వారా విషయం తెలుసుకున్న గోషామహల్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నంబర్‌ను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ ఆచూకీ కనిపెట్టారు.

అతనిలో అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నాడు: సీపీ సజ్జనార్

సన్మాన కార్యక్రమంలో సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ సాహసాన్ని కొనియాడారు. ‘కళ్ల ముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో ప్రాణాలకు తెగించి రౌడీషీటర్‌ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నాడు’ అని ప్రశంసించారు. ‘ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసిన ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా.. జాహెర్‌లా ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.’ ఈ సందర్భంగా సజ్జనార్ పిలుపునిచ్చారు.

16 కేసులున్న రౌడీషీటర్ అరెస్ట్

పట్టుబడిన నిందితుడు డబీర్‌పురకు చెందిన మహ్మద్ సోహేల్‌పై గోషామహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్ర మోహన్, గోషామహల్ ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story