హైటెక్ సిటీలో ఆటో డ్రైవర్ వీరంగం.. పోలీసుల ముందే ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |

హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి.

హైటెక్ సిటీలో ఆటో డ్రైవర్ వీరంగం.. పోలీసుల ముందే ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా, ఏకంగా పోలీసుల ముందే అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ ఆటో డ్రైవర్ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీ ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీస్ వాహనం ముందే ఓ ఆటో డ్రైవర్ ప్రమాదకర విన్యాసాలు (Stunts) చేస్తూ హల్చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పోలీసు వాహనం ముందే విన్యాసాలు

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హైటెక్ సిటీ ప్రాంతంలో రాత్రి వేళ ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ హంగామా సృష్టించాడు. అంతటితో ఆగకుండా వెనుక ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూస్తూనే, దానికి అతి సమీపంలో ఆటోను తిప్పుతూ స్టంట్లు చేశాడు. ఏమాత్రం అదుపు తప్పినా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పటికీ, "నన్నేమీ చేయలేరు" అనే ధీమాతో ప్రవర్తించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనం దిగి అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, డ్రైవర్ అక్కడి నుంచి ఆటోతో సహా పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా స్పందించారు. వీడియో ఆధారంగా ఆటో నంబర్‌ను గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రమాదకరంగా ఆటో నడుపుతూ, స్టంట్లు చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాము. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అతడిని రాయదుర్గం లా అండ్ ఆర్డర్ (Law & Order) పోలీసులకు అప్పగించాము. ప్రజల భద్రతకు ముప్పు కలిగించేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

Next Story