ఆటో డ్రైవర్స్ 'చలో అసెంబ్లీ' ఉద్రిక్తత.. అక్కడి నుంచి ర్యాలీగా జేఏసీ నేతలు

by Disha Web Desk 13 |
ఆటో డ్రైవర్స్ చలో అసెంబ్లీ ఉద్రిక్తత.. అక్కడి నుంచి ర్యాలీగా జేఏసీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ పిలుపులో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్ల 'చలో అసెంబ్లీ' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మొదటగా హిమాయత్ నగర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమైయ్యే‌లోపు పోలీసుల బారికేడ్ల తోసుకుంటూ అసెంబ్లీ వైపు పరుగులు తీశారు.


పోలీసులు హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్టు చేసి నగరంలోని పలు పొలీస్ స్టేషన్‌లకు తరలించారు. పలువురు జేఏసీ నేతలను పోలీసులు ముందుస్తుగానే అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వినర్, ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం మాట్లాడుతూ.. 2014 సంవత్సరం నుంచి నేటి వరకు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించలేదని, నిరసనలు చేసిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరగడం వల్ల రవాణా రంగ కార్మికుల జీవనం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలను మినిమం ఛార్జి రూ. 45, కిలోమీటర్‌కు రూ. 20 వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. సామాజిక భద్రత కోసం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ, కొత్త ఆటో పర్మిట్లను జారీ చేయాలని, పెరిగిన ఆటో ఇన్సూరెన్స్ ధరలను తగ్గించాలని పలు డిమాండ్స్ చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాదిరి రాష్ట్రంలో కూడా లైసెన్స్‌ కలిగిన ప్రతి ఆటో కార్మికునికీ 'వాహన మిత్ర' ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ వి.ఎస్. బోస్, జేఏసీ నేతలు ఏ. సత్తి రెడ్డి, ఎంఏ.సలీం, నజీర్, ఆర్. మల్లేష్, కొమురవెల్లి బాబు, ఎస్‌.కె. లతీఫ్, ఎం. శ్రీనివాస్, యాదగిరి, ఫరూక్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed