పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్.. చివరికి ఏమయ్యాడో తెలుసా?

by Ramesh Naini |   (  Updated:2026-01-05 10:56:52  IST  )

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల విధులను అడ్డుకుని, పామును చూపించి బెదిరించిన ఘటన నగరంలో కలకలం రేపింది.

పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్.. చివరికి ఏమయ్యాడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల విధులను అడ్డుకుని, పామును చూపించి బెదిరించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం నిందితుడితో వీడియోలో బహిరంగ క్షమాపణలు చెప్పించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్‌ (23)ను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా 150 రీడింగ్ నమోదైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆటో‌ను సీజ్ చేశారు.

పాముతో సహా అక్కడి నుంచి పరార్..

దీంతో ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ అకస్మాత్తుగా తన ఆటో నుంచి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకునేలోపు నిందితుడు పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తర్వాత దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు సయ్యద్ ఇర్ఫాన్ (23), తండ్రి సయ్యద్ హుస్సేన్, వృత్తిగా ఆటో డ్రైవర్, పహాడీషరీఫ్ నివాసి అని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో వాహనం నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.

ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడను

అరెస్ట్ అనంతరం నిందితుడితో పోలీసులు వీడియోలో క్షమాపణలు చెప్పించారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణలు చెప్పి, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, మద్యం సేవించనని హామీ ఇచ్చాడు. అనంతరం పోలీసులు చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నారు. వీడియో ఇదే..

Next Story