భూ సమస్యల పరిష్కారానికి పంద్రాగస్టు టార్గెట్.. పని ఒత్తిడితో అధికారులు సతమతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-29 02:38:00  IST  )

‘మా మండలంలో భూ సమస్యలకు సంబంధించి 1500 దరఖాస్తులు ఉన్నాయి. 300 వరకు సాదాబైనామా, 500 వరకు మిస్సింగ్ సర్వే నంబరు, 400 వరకు విస్తీర్ణం హెచ్చుతగ్గులు.. ఇలా అప్లికేషన్లు వచ్చాయి.

భూ సమస్యల పరిష్కారానికి పంద్రాగస్టు టార్గెట్.. పని ఒత్తిడితో అధికారులు సతమతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మా మండలంలో భూ సమస్యలకు సంబంధించి 1500 దరఖాస్తులు ఉన్నాయి. 300 వరకు సాదాబైనామా, 500 వరకు మిస్సింగ్ సర్వే నంబరు, 400 వరకు విస్తీర్ణం హెచ్చుతగ్గులు.. ఇలా అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 90 శాతం ఇతరుల పేరిట ఎక్కినవే. అయితే పంద్రాగస్టుకల్లా వీటిని పరిష్కరించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎల్ఆర్ యూపీ సమయంలో మా మండలంలో 120 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు 20 మంది కూడా లేరు. ఇందులోనూ ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఫైల్ రాయడం కూడా సరిగా రాదు. ఇక నోటీసుల జారీ, సమాధానాల స్వీకరణ ఎలా సాధ్యం? ఒక్కో రోజు రాత్రి ఒంటి గంట దాకా పని చేస్తున్నాం. ఉదయమే మళ్లీ వీడియో కాన్ఫరెన్స్. జిల్లాలో ఐదుగురు సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఇలాంటి ఒత్తిడి ఉంటే డ్యాష్ బోర్డు క్లియర్ చేయడం తప్పా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు న్యాయం చేయడం కష్టమే’ హైదరాబాద్‌కు 90 కి.మీ. దూరంలోని ఓ మండల ఇన్‌చార్జి తహశీల్దార్ ఆవేదన ఇది.

రాష్ట్రంలోని అనేక మండలాల్లో తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఇలాంటి పని ఒత్తిడినే ఎదుర్కొంటున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ .. ఇలా రెండు రకాలుగా పని చేయాలన్న నిబంధనతో మీ సేవా కేంద్రం విధులను కూడా నిర్వహించాల్సి వస్తున్నదని తహశీల్దార్, డీటీ, ఆర్ఐలు వాపోతున్నారు. రెండు దఫాలుగా ఫైళ్లు సర్క్యులేట్ చేయాల్సి వస్తున్నదని చెబుతున్నారు.

అధికారాలను కట్టబెట్టకపోవడంతో..

భూభారతి రూల్స్ అమలులో అధికార యంత్రాంగం విఫలమవుతున్నదనే విమర్శలు ఉన్నాయి. తహశీల్దార్లు, ఆర్డీవోలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టాలన్న నిపుణుల సూచనలను సీనియర్ ఐఏఎస్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన 8.50 లక్షల అప్లికేషన్ల పరిష్కారంలోనూ ఆటంకాలను సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పంద్రాగస్టు లోపు సమస్యల పరిష్కరించాలన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సదుద్దేశానికి ఉన్నతాధికారులే బ్రేకులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

సరిపడా సిబ్బంది లేక..

భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఒక్కో మండలంలో వంద మందికిపైగా సిబ్బంది ఉన్నారు. కానీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దయిన తర్వాత 20 మందికి మించి లేరు. అలాంటప్పుడు ఒక్కో మండలంలో 500 నుంచి 1500 వరకు దరఖాస్తులను పరిష్కరించడం అసాధ్యమని తహశీల్దార్లు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ఫైళ్లతో పాటు, ధరణి, భూ భారతి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ నోటీసులు జారీ చేయడం, విచారించడం, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకోవడం, సర్వే చేయించడం, ఫైల్ రాయడం, అప్ లోడ్ చేయడం, కేవైసీ చేయించడం వంటి పనులన్నీ ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు.

రెండు సార్లు చేయాల్సిందే

ఆఫ్ లైన్ దరఖాస్తులకు మరోసారి ఆన్ లైన్ చేయాలన్న నిబంధన విధించారు. దాంతో దరఖాస్తుదారుడిని ఆఫ్ లైన్, ఆన్ లైన్ కోసం రెండు సార్లు పిలిచి మాట్లాడాల్సి వస్తున్నదని తహశీల్దార్లు అంటున్నారు. ‘మొదటి సారి నోటీసులు జారీ చేస్తాం. ఫైల్ అంతా రెడీ చేస్తాం. ఆర్డీవో, కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్లీ ఆన్ లైన్ లో దరఖాస్తు అప్ లోడ్ చేయాలి. సదరు రైతును పిలిచి వేలిముద్రలు తీసుకోవాలి. అంటే మీ సేవా కేంద్రం నిర్వాహాకులు చేసే డ్యూటీ చేయాలి. ఆ తర్వాత మరో సారి నోటీసులు జారీ చేయాలి. అయితే మొదటి సారి నోటీసు, రెండో సారి నోటీసు వేర్వేరు నంబర్లతో ఉంటుంది. ఈ ఫైళ్లు అన్నీ స్కాన్ చేయాలి. ఒక్కొక్కటి ఏడు పేజీలకు పైగా ఉంటుంది. అప్రూవ్ చేస్తున్నామని చెప్తేనే రైతులు ఆఫీసుకు వచ్చి థంబ్ వేయడానికి సిద్ధపడతారు. కానీ అదే ఫైళ్లు రిజెక్ట్ చేస్తున్నామన్నప్పుడు కూడా థంబ్ అవసరం. అలాంటప్పుడు వాళ్లు ఆఫీసుకు రావడం లేదు’ అని తహశీల్దార్లు పేర్కొంటున్నారు. ఒకే పనిని రెండేసి సార్లు చేయడం ద్వారా పని భారం పెరగడంతోపాటు సమయం చాలా పడుతున్నదని తహశీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు

ధరణి పోర్టల్ లో ఇప్పటికే చాలా సార్లు రిజెక్ట్ చేసిన ఫైళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఫైళ్లు, రికార్డుల్లో ఉన్నోళ్లకు భూమి లేకపోవడం, భూమి ఉన్నోళ్లు రికార్డుల్లో లేకపోవడం, ఒక్కో సర్వే నంబరులో విస్తీర్ణం డబుల్ కావడం వంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి అప్లికేషన్లు పరిశీలించి పరిష్కరించడానికి చాలా కష్టమవుతుందని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. సర్వే నంబర్ మిస్సింగ్, ఎక్స్ టెంట్ మిస్సింగ్ ఫైల్స్ మరోసారి కూడా రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ‘రికార్డులను పూర్తి స్థాయిలో వెరిఫై చేసి రిపోర్టులు రాయకపోతే తిరస్కరణకు గురవుతాయి. సరిగ్గా రిపోర్టు రాయాలంటే సరైన సమయం ఇవ్వాలి’ అని ఓ తహశీల్దార్ ‘దిశ’కు వివరించారు. ప్రభుత్వానికి భూ భారతి ఆర్వోఆర్ 2025 ద్వారా మంచి పేరు రావాలంటే కింది స్థాయి ఆఫీసర్లకు అధికారాలు బదలాయించడం, సిబ్బందిని పెంచడం మినహా మరో ఆప్షన్ లేదంటున్నారు.

సంగారెడ్డి జిల్లాలో డివిజన్ల వారీగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు


ఇందులో హత్నూరా మండలంలో 1,385, కొండాపూర్ మండలంలో 1,718, సదాశివపేట మండలంలో 948, ఆందోలు మండలంలో 1,492, నిజాంపేట మండలంలో 1,112 వంతున అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇలా వెయ్యికి పైగా పెండింగులో ఉన్న మండలాలు చాలా ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, హన్మకొండ వంటి జిల్లాల్లో గతంలో తిరస్కరణకు గురైన అప్లికేషన్లు చాలా ఉన్నాయి. వీటి పరిష్కారానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులు కోరుతున్నారు.

Next Story