హైకోర్టు కోర్టు మాట వినని అత్తాపూర్ ఆర్డీవో.. నెల రోజులు జైలు, జరిమానా!

by Ramesh Naini |

తెలంగాణ హైకోర్టు నిర్దేశించిన గడువులోగా విధులను నిర్వర్తించడంలో విఫలమైన అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

హైకోర్టు కోర్టు మాట వినని అత్తాపూర్ ఆర్డీవో.. నెల రోజులు జైలు, జరిమానా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు నిర్దేశించిన గడువులోగా విధులను నిర్వర్తించడంలో విఫలమైన అత్తాపూర్ ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం వహించడం, నిర్దేశించిన సమయాన్ని పాటించకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శంషాబాద్ మండలం, పెద్దషాపూర్ గ్రామంలోని 74 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై హైదరాబాద్‌కు చెందిన యూసుఫుద్దీన్ ఖాన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూ వివాదంపై చట్టప్రకారం విచారణ జరిపి, తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అత్తాపూర్ ఆర్డీవోను కోర్టు ఆదేశించింది. దీనిపై గత ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరు వారాల గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆర్డీవో కొప్పుల వెంకట్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు విధించిన గడువు ముగిసినప్పటికీ ఆర్డీవో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడమే కాకుండా, ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కోర్టు ఆదేశించినా ఆర్డీవో స్పందించకపోవడంతో, పిటిషనర్ యూసుఫుద్దీన్ ఖాన్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం.. ఆర్డీవో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది. విచారణ సమయంలో ఆర్డీవో తరపున వాదనలు వినిపిస్తూ.. ఆ తర్వాత ఆదేశాలు అమలు చేశామని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయించిన ఆరు వారాల గడువులోగా ఉత్తర్వులు జారీ చేయడంలో ఆర్డీవో పూర్తిగా విఫలమయ్యారని ధర్మాసనం నిర్ధారించింది. కోర్టు విధించిన గడువు ముగిసిన తర్వాత ఆదేశాలు అమలు చేసినా, దానిని పరిగణనలోకి తీసుకోలేము. నిర్దేశించిన సమయాన్ని పాటించకపోవడమే కోర్టు ధిక్కరణ అవుతుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి న్యాయస్థానాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఉపేక్షించలేమని పేర్కొంటూ, నెల రోజుల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. ప్రభుత్వ అధికారులు కోర్టు ఉత్తర్వుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇటువంటి కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.

Next Story