హెచ్‌‌సీయూలో దాడులు.. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

by Ramesh Naini |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని, విద్యార్థుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఏబీవీపీ శక్తులు దాడులకు తెగబడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హెచ్‌‌సీయూలో దాడులు.. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని, విద్యార్థుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఏబీవీపీ శక్తులు దాడులకు తెగబడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు తమ అకడమిక్ ప్రాజెక్టులో భాగంగా ప్రదర్శించిన “హోలీ” నాటకాన్ని అడ్డుకుని, విద్యార్థులపై హింసాత్మక దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మే 3న నాటక ప్రదర్శన ముగిసిన తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు అల్లర్లు సృష్టించారని, 4న నాటకాన్ని వీక్షించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సమయంలో, ముందస్తు ప్రణాళికతో వచ్చిన ఏబీవీపీ గుంపులు బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడికి దిగాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఈ హింసాత్మక ఘటనలో పలువురు సామాన్య విద్యార్థులతో పాటు, ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా తీవ్రంగా గాయపడ్డారని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఎన్నికైన యూనియన్ సభ్యులే ఈ దాడులకు నేతృత్వం వహించడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, కార్యదర్శి టి. నాగరాజు విమర్శించారు. “గోలి మారో” వంటి రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ విద్యార్థులను, అధ్యాపకులను భయభ్రాంతులకు గురిచేయడం వారి అప్రజాస్వామ్య తీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. హింసకు పాల్పడిన ఏబీవీపీ కార్యకర్తలను, సంబంధిత యూనియన్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతను యూనివర్సిటీ యాజమాన్యం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అకడమిక్ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే శక్తులపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలని కోరారు.

Next Story