ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్

by Malleboina Mahesh |

కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్: కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఈ ఘటన చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే డ్రైవర్ పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటన పై సీపీ సజ్జనార్ (CP Sajjanar) స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనపై హైదరాబాద్ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులపై దాడులు, బెదిరింపులు, ఆటంకాలు సృష్టించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ఏ ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా దాడులు జరిపితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వాటిని చిన్న ఘటనలుగా తీసుకోకుండా, నేరపూరిత చర్యలుగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ఇలాంటి నేరాలకు సంబంధించిన శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో కూడా సజ్జనార్ వివరించారు. ఉద్యోగులపై దాడి చేయడం బీఎన్ఎస్ (భారత న్యాయ సంహిత)లోని సెక్షన్ 221, 132, 121(1) కింద తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. కేసు ఒకసారి నమోదైతే—పాస్‌పోర్ట్ జారీ, ప్రభుత్వ ఉద్యోగాలు, భవిష్యత్ అవకాశాలు అన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. క్షణికావేశంలో చేసే చిన్న తప్పిదం కూడా జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని, అందరూ నియంత్రణతో వ్యవహరించాలని కఠిన హెచ్చరిక జారీ చేశారు.

Next Story