- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో వైద్యుడిపై దాడి హేయం.. వైద్య సంఘాల ఆగ్రహం
నిర్మల్ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పీడియాట్రీషియన్ డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-ఎస్‌ఆర్‌డీఏ) తీవ్రంగా ఖండించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పీడియాట్రీషియన్ డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-ఎస్‌ఆర్‌డీఏ) తీవ్రంగా ఖండించాయి. బిల్లింగ్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా రోగి బంధువులు వైద్యుడితో పాటు ఆస్పత్రి సిబ్బందిపై భౌతిక దాడికి దిగడం అత్యంత దురదృష్టకరమని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం రాత్రి డిశ్చార్జ్ సమయంలో బిల్లు చెల్లింపుపై వాగ్వాదం చోటు చేసుకుంది. రీయింబర్స్‌మెంట్ మొత్తానికి మించి అదనపు బిల్లు అడిగారనే సాకుతో రోగి బంధువులు డాక్టర్ సంతోష్ రాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్పత్రి ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది. వైద్యులు ఎంతో ఒత్తిడి మధ్య ప్రాణాలు కాపాడేందుకు పనిచేస్తుంటారని, ఇటువంటి దాడులు వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని టీ-ఎస్‌ఆర్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది.
ఐఎంఏ తెలంగాణ లేఖ..
ఈ దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి, కఠిన చట్టాలను ప్రయోగించాలని, ఆస్పత్రులు, క్లినికల్ సెట్టింగ్‌లలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని, వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీ-ఎస్‌ఆర్‌డీఏ కోరింది. ఈ ఘటనపై ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. కిషన్, కార్యదర్శి డాక్టర్ వి. అశోక్ స్పందిస్తూ.. నిర్మల్ ఎస్పీ జి. జానకి షర్మిలకు లేఖ రాశారు. యుద్ధ ప్రాతిపదికన నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్న వారిపై ఇటువంటి దాడులు కొనసాగితే వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. బాధితుడైన డాక్టర్ సంతోష్ రాజ్‌కు వైద్య లోకం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.






