డ్రగ్స్ వినియోగిస్తూ..పవిత్ర వృత్తికే కళంకం

by velandi.Saikiran |

అతిర హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ కుమార్ 65 గ్రాముల గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు

డ్రగ్స్ వినియోగిస్తూ..పవిత్ర వృత్తికే కళంకం
X

డ్రగ్స్ వినియోగిస్తూ..

పవిత్ర వృత్తికే కళంకం

ప్రజలను కాపాడాల్సిన వైద్యులే డ్రగ్స్ కు బానిసలైతే..

మత్తు కోసం జీవితం చిత్తు చేసుకుంటున్న యువ వైద్యులు

దిశ, బ్యూరో : డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఈగల్‌‌ (ఎలైట్‌‌యాక్షన్ గ్రూప్‌‌ ఫర్ డ్రగ్‌‌లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌) ఇప్పటివరకూ చేసిన యాంటీ డ్రగ్స్ ఆపరేషన్లలో మత్తు పదార్థాలకు బానిసలైన పలువురిని పట్టుకోవడం ఒక ఎత్తయితే, ఏకంగా ఒకే కాలేజీ కి చెందిన 32 మంది మత్తు బానిసలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరి సంఖ్య విచారణలో మూడురెట్లకి పెరగడంతో అధికారులు అవాక్కయారు.

అన్నీ ఉన్నా...

గతంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో అతిర హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ కుమార్ 65 గ్రాముల గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సదరు డాక్టర్ ఖండించినా, అసలు గంజాయి డాక్టర్ ప్రదీప్ దగ్గరకు ఎలా చేరిందనే దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

అడిక్షన్ కోసం లక్షల ఖర్చు..

ఇక నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ ఫౌండర్ కుమార్తె అదే ఆసుపత్రిలో డైరెక్టర్ గా, డాక్టర్ గాను విధులు నిర్వహిస్తోంది. ఆమె నేరుగా ముంబై నుండి డ్రగ్స్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటోంది. ఒక సంవత్సరంలోని 70 లక్షల పాటు డ్రగ్స్ పై ఖర్చు చేసిందంటే ఆమె ఎంతగా బానిస అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఎందుకిలా?

నిజానికి వైద్య వృత్తి చాలా ఒత్తిడితో కూడుకున్నది. విద్యార్థి సమయంలోనే అటు సీటు సంపాదించడం దగ్గర నుండి కఠినమైన సబ్జెక్టులు క్లియర్ చేయడం వరకు, ఆ తరువాత వృత్తిలో స్థిరపడడం, రోజువారీగా ఎదురయ్యే ఒత్తిళ్లు కొంతమందిని చెడుదారుల వైపు మళ్ళిస్తున్నాయి.

ఇలాంటివే మరికొన్ని కేసులు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల లో మమతా ఈఎన్టీ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ మదన్మోహన్ ఏకంగా ఓ డ్రగ్ నెట్వర్క్ నడిపిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మాన్విత ఫార్మసీ పేరుతో మెడికల్ షాప్ లైసెన్స్ తీసుకొని, మత్తు పదార్థాలను స్టాక్ ఎక్కువ తీసుకొని నిల్వచేశారు. వీటిని బానిసలైన వారికి అధిక ధరలకు అమ్మేవారు.

ప్రతిష్టాత్మక కాలేజీలోనూ..

ఇక 2024లో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు మణికందన్, అరవింద్.... మరో పదిమంది వైద్య విద్యార్థులకు గంజాయి అమ్ముతూ, 80 గ్రాముల గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక ఇతర రాష్ట్రాల మెడికల్ కాలేజీలు, ఆస్పత్రిలో సైతం ఇలాంటి డ్రగ్ అడిక్షన్ కి సంబంధించి కేసులు తరచుగా బయటపడుతున్నాయి.

పరిష్కారం ఎలా?

నిజానికి వైద్య విద్య పూర్తి చేయడం కూడా చాలా కష్టం. తరువాత వృత్తికి సంబంధించిన ఒత్తిడి రోజూ ఉంటుంది. వీటి నుండి బయటపడడానికి డ్రగ్స్ ని ఆశ్రయిస్తున్న కొందరు వైద్య విద్యార్థులు ఆ తరువాత దీనిని అలవాటుగా మార్చుకుంటున్నారు. కాలేజీ స్థాయి లోనే మరింత కఠినమైన నిబంధనలు అమలుచేసి, మత్తు పదార్థాల వినియోగాన్ని అడ్డుకుంటేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఫణిరాజ్.కే

Next Story