TG: ఎక్సైజ్ కమిషనర్‌ను బదిలీ చేయాలి

by Gantepaka Srikanth |

ఎక్సైజ్ కమిషనర్ అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గురువారం ప్రకటన విడుదల చేసింది.

TG: ఎక్సైజ్ కమిషనర్‌ను బదిలీ చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సైజ్ కమిషనర్ అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గురువారం ప్రకటన విడుదల చేసింది. అసోసియేషన్ కథనం ప్రకారం.. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు కమిషనర్ హరికిరణ్.. నిజామాబాద్ డీసీ సోమిరెడ్డికి ఫోన్ చేసి బూతులతో దూషించారు. తోటి అధికారి అని చూడకుండా వ్యక్తిగత దూషణలకు దిగడంతో సోమిరెడ్డి తీవ్ర మానసిక క్షోభకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇదే తరహాలో టీఎస్‌బీసీఎల్ జీఎం జీ.శ్రీనివాసరావును కూడా కమిషనర్ నోటికొచ్చినట్లు తిట్టడంతో, ఆయన ఒత్తిడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు ఉన్నతాధికారులు చికిత్స పొందుతుండటం శాఖలో పరిస్థితికి అద్దం పడుతోంది. కమిషనర్ పదవిలో హరి కిరణ్ కొనసాగితే పారదర్శకమైన విచారణ జరగదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆయనను వెంటనే ఆ పోస్టు నుంచి బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ వివాదం సర్దుమణిగిందని జేఏసీ చేసిన ప్రకటనపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడైన సోమిరెడ్డికి తెలియకుండానే జేఏసీ ఏకపక్షంగా ఎలా రాజీ కుదుర్చుకుంటుందని నిలదీసింది. బాధితులకు న్యాయం జరగాలంటే కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముకుంద రెడ్డి మామిడి, ఇతర సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story