దమ్ముంటే నెల రోజులు పాటు అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి.. బీజేపీ డిమాండ్

by Prasad Jukanti |   (  Updated:2025-12-28 09:38:40  IST  )

రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించాలని బీజేపీ డిమాండ్ చేశారు.

దమ్ముంటే నెల రోజులు పాటు అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి.. బీజేపీ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రేపటి నుంచి జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహంచి అన్ని ప్రజా సమస్యలపై చర్చించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 100 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలోనూ వింటర్ సీజన్ కేవలం ఒకే రోజు నిర్వహించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని ఇప్పుడైనా ప్రజాసమస్యలన్నింటిపై చర్చించేందుకు సభను ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారో చెప్పాలన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల సమస్యలు ఉన్నాయని రైతు కూలీలకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ. 12 వేలే ఇస్తామన్నారు. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ విషయం ప్రస్తావించడం లేదని నిలదీశారు. 420 హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు.

ఉద్యోగాల భర్తీ, మహిళలకు నెలకు 2500, కల్యాణ లక్ష్మి కింద మహిళలకు తులం బంగారం వంటి అనేక హామీలు ఇచ్చి వాటిని తుంగలోకి తొక్కిందన్నారు. పూర్తిగా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం ఇవాళ కనీసం ప్రజా సమస్యలపై చర్చించే దమ్ములేదన్నారు. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా ఎవరొచ్చినా చర్చకు సరేనన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కనీసం రిపేర్స్ కు కూడా నోచుకోలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలతో పాటు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ ఇప్పటికి నెరవేరలేదంటే ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం అని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలన్నింటిపై చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.




భూభారతి పేరుతో కొత్త విధానం తీసుకువచ్చి ఉన్న భూములను హారతి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పూర్తిగా ప్రజారోగ్యం నిర్వీర్యం అయిందని వీటిపై చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్న రేవంత్ రెడ్డి.. ఏమైంది మీ ప్రజాదర్బార్ అని నిలదీశారు. ప్రజాదర్భార్ లో వచ్చిన సమస్యలు పరిష్కారం విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని, పూర్తిగా దివాళా తీస్తుంటే దీనిపై ఏదైనా ప్రణాళిక ఉందా దీనిపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎవరితోనో ఫుట్ బాల్ ఆడేందుకు రేవంత్ రెడ్డి రూ. 100 కోట్లు వెచ్చిస్తున్నారు? ఎందుకు ఈ హెచ్చులు అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కోర్టుకు అబద్దాలు చెప్పి ఫార్మాసిటీ భూములను ఫోర్త్ సిటీకి మార్చుకుంటున్న మీకు వీటిపై చర్చించే దమ్ము ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరింస్తున్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు వారి బెన్ఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిన బాధ్యులను కటకటాల వెనక్కి పంపుతానని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఎంత మందిపై కేసులు నమోదు చేసి ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వీటన్నింటిని చర్చకు సిద్ధమా అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాల రద్దు విషయంలో బీజేపీ అసెంబ్లీలో పోరాటం చేస్తుందన్నారు.

Next Story