- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పారాక్వాట్’ నిషేధంపై అసెంబ్లీ తీర్మానం.. రైతు కమిషన్ హర్షం
ప్రాణాంతక పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ (Paraquat) గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన రసాయనం వల్ల వందలాది మంది తెలంగాణ రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి మందులు, కలుపు నివారణ మందులను నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), రైతు సంఘాల నేతలు గతంలోనే రైతు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో పారాక్వాట్‌ను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా దీనిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రైతు కమిషన్ కోరింది. కమిషన్ సూచన మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం గడ్డి మందు నిషేధంపై తన కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా అమెజాన్ (Amazon) వంటి ఈ-కామర్స్ సంస్థల్లో ఈ ప్రమాదకర మందు ఇంకా అందుబాటులో ఉండటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణమే అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అనంతరం, భూసార పరీక్షా కిట్ల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు భూసార పరీక్షలపై మరింత అవగాహన కల్పించాలని, నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసేలా చూడాలని సూచించారు. పంట మార్పిడి విధానంపై కూడా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, కె.వి.ఎన్ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అధికారులు గీతారెడ్డి, సుచరిత, శ్రీధర్, కమిషన్ సిబ్బంది సంధ్యారాణి, హరి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.






