- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డికి షాక్.. ఎథిక్స్ కమిటీ సిఫార్సుకు అసెంబ్లీ తీర్మానం
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు సభ తీర్మానించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చకు దారితీసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి.. చేతితో సైగ చేస్తూ గన్ తో కాలుస్తానని అన్నారని సీఎం ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాల్లో రికార్డయిందని పేర్కొన్నారు. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే.. అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు సభకు సహకరిస్తేనే సభలో ఉంచాలని, అడ్డుకునే శైలి ఉంటే.. తదుపరి సమావేశాల వరకూ సస్పెండ్ చేయాలని రేవంత్ కోరారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ.. అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ జాతి కక్ష, రాజకీయ వివక్ష ప్రదర్శిస్తోంది
అంతకుముందు సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎస్సీని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీలకు పరిపాలన చేతకాదు.. దొర సీఎం కావాలని కేసీఆర్ మాట మార్చారన్నారు. బీఆర్ఎస్ జాతి కక్ష, రాజకీయ వివక్ష ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఎస్సీల పట్ల అంత కుల వివక్ష ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్.. హరీష్ రావు, కేటీఆర్, దయాకర్ రావులను మంత్రుల్ని చేస్తే.. తాము భట్టి విక్రమార్క, అడ్లూరి, వివేక్, దామోదర రాజనర్సింహ, సీతక్కలకు మంచి పదవులు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2018 తర్వాత కొప్పుల ఈశ్వర్ కు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారన్నారు. కేసీఆర్ కేబినెట్ కూర్పు చూస్తే ఎస్సీలపై ఎంత వ్యతిరేకత ఉందో కనిపిస్తుందన్నారు. భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతను చేస్తే.. ఫిరాయింపులతో ఆ పదవి కూడా లేకుండా చేశారని వాపోయారు. ఎస్సీలపై వివక్ష తప్ప కనీస మానవత్వం చూపలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ స్పీకర్ స్థానంలో ఉండకూడదన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు పోడియం వద్ద నిరసన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.






