నవంబర్‌ 22 లోగా జూబ్లీహిల్స్ బైపోల్! సీఈసీ కీలక అప్ డేట్

by Prasad Jukanti |   (  Updated:2025-10-05 12:35:41  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకోసం ఏర్పాట్లు జరుగుతున్న వేళ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నవంబర్‌ 22 లోగా జూబ్లీహిల్స్ బైపోల్!  సీఈసీ కీలక అప్ డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills by-election) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం కొత్త అస్త్రాలు తెరమీదకు తీసుకొస్తున్నాయి. ఈ ఎన్నికలో అందరికంటే ముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇక తమ అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం అంతా జూబ్లీహిల్స్ చూట్టే తిరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ విషయంలో కీలక అప్ డేట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ బై పోల్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‍లో నవంబర్ 22లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీకి 22 నవబంర్ 2025తో గడువు ముగియనుంది. ఆ గడువులోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత రెండు రోజులుగా బిహార్‍లో ఈసీ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పట్నాలో ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.

17 కొత్త మార్పులు:

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, మరింత పారదర్శకంగా నిర్వహించడానికి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 17 కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వీటిలో కొన్ని ఎన్నికల నిర్వహణ కోసమైతే మరికొన్ని కౌంటింగ్ సమయంలో అమలు చేసేందుకు మార్పులు చేశామన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్ల వరకు మాత్రమే ఉంటారని చెప్పారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఏర్పాటు చేస్తామని తద్వారా ఓటర్లు అభ్యర్థులను తేలికగా గుర్తుపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్ఐఆర్ ను బిహార్ ఓటర్లు స్వాగతించారని వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందన్నారు.

Next Story