తెలంగాణలో భారీగా పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు!

by Muthe.Rajitha |

2028లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో భారీగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో భారీగా పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : 2028లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో భారీగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగనున్నట్టు తెలుస్తోంది. నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 153కు పెరుగుతాయని, నాయకులు ఇకపై టికెట్ల కోసం ఢిల్లీ వెళ్ళే పని లేదని, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి దారిఖర్చులు కూడా ఇచ్చి పంపుతామని రేవంత్ అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. రానున్న ఎన్నికల్లో నిజంగానే సీట్లు పెరుగుతాయా అని ఆశావహులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అయితే నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం జనాభా లెక్కలు చేపట్టిన తరువాత వచ్చే మొదటి ఎన్నికల నుంచి ఈ సీట్లు పెరగనున్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానానికి మరో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య మరో 34 కు పెరగనుంది. అంటే అసెంబ్లీ స్థానాలు మొత్తం 153 కానున్నాయి. ఇక పార్లమెంటు స్థానాలు జనాభా ప్రాతిపదికన మరో 8 కి పెరగనుండగా.. మొత్తం 25 కు చేరనున్నాయి. కాగా 2026లో జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండగా.. ఆ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికలు అనగా 2028లో(తెలంగాణలో) జరిగే ఎన్నికల్లో ఈ సీట్ల పెంపు ఉండనుంది.

అలాగే మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉండగా.. ఇకపై చట్ట సభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అయితే అది కూడా జన గణన అనంతరం అమలు కానుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నేడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది అని వ్యాఖ్యానించారు.

Next Story