- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణ
తెలంగాణ అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆదివారం రాత్రి 1.30 వరకు సాగిన సభ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. కాళేశ్వరంపై ఏకంగా తొమ్మిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దోచుకున్న వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణ జరగాలని, నిజాయితీతో విచారణ జరగాలనే సీబీఐకి అప్పగించేందుకు నిర్ణయించామని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టులో క్రిమినల్ చర్యలకు అర్హమైన లోపాలు.. అవకతవకలను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గుర్తించిందని పేర్కొన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పులను తేల్చారని, అదేవిధంగా ప్రాజెక్టులో లోపాలను NDSA కూడా గుర్తించిందని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై సమగ్ర విచారణ జరపాలని NDSA, ఘోష్ కమిషన్ చెప్పాయని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని సీఎం రేవంత్ రెడ్డి సభలో పునరుద్ఝాటించారు.
కేసీఆర్, హరీశ్‌రావు అరాచకాలను ఈటల ఆపలే..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ.లక్షల కోట్లు వెనకేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75 శాతం నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఆ పథకం కింద కేంద్రం గుర్తించిందని గుర్తు చేశారు. ఆ లిస్ట్‌లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉందని, కానీ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని ఫైర్ అయ్యారు. నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల ముందే ఇదంతా జరుగుతున్నా.. కేసీఆర్, హరీశ్‌రావులను ఆయన ఆపే ప్రయత్నం చేయలదేని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ వైఫల్యం నేరమని NDSA రిపోర్టు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం రూ.లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా ఉందని అభివర్ణించారు. వాళ్ల తప్పులను ఎత్తి చూపిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురించి తప్పుగా మాట్లాడటం సమంజసమేనా.. అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చేసిన తప్పులు బయటపెట్టాం కాబట్టే.. హరీశ్ రావు తమపై అక్కసును వెల్లగక్కుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో నిర్మాణంలో వ్యవస్థను నాడు మంత్రి హోదాలో ఉన్న హరీశ్ రావు తప్పుదోవ పట్టించారని ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు.
కమీషన్లకు ఆశపడి..
ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి రూ.6,157 కోట్లు ఖర్చుచేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం చాలా తగ్గేదని.. కానీ, కల్వకుంట్ల ఫ్యామిలీ కమీషన్లకు ఆశపడి అక్కడి నుంచి ప్రాజెక్టును తరలించారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలి ఏడాది రూ.5,523 కోట్లు ఖర్చు చేశారని, ఈ ప్రాజెక్టు కింద రూ.11,670 కోట్లు ఖర్చు చేసిన తరువాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారని అన్నారు. అయితే, తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకునేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అక్కడ ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని వాప్కోస్ కూడా చెప్పిందని గుర్తు చేశారు. అక్కడ 205 టీఎంసీల లభ్యత ఉందని నాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ ప్రతిపాదనలను నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని వాప్కోస్ సంస్థను అడిగారని.. ఆ తర్వాత కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆజ్యం పోసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మూడు బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్తు వినియోగం 3 వేల మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగిందని.. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం.. కాళేశ్వరం రీడిజైన్ కారణంగా రూ.1.47లక్షల కోట్లకు చేరిందని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు.
తెలంగాణలో సీబీఐ ముందుకు రెండు కేసులు..
కాగా, ఇప్పటికే న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్యకేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న ఈ జంట హత్యలు జరిగాయి. ప్రధాన సూత్రధారి పుట్టా మధుకర్ పేరును నిందితుల జాబితాలో చేర్చకుండా తెలంగాణ పోలీసులు దర్యాప్తును పక్కదోవ పట్టించినందున.. నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఈ కేసును కూడా సీబీఐకే అప్పగించేందుకు నిర్ణయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు.






