అంగరంగ వైభవంగా ఆషాడ మాస బోనాలు.. అధికారులను ఆదేశించిన మంత్రులు

by Bhanu |

ఈనెల 26 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహించే ఆషాడ మాస బోనాలను అంగ రంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లు అధికారులను ఆదేశించారు.

అంగరంగ వైభవంగా  ఆషాడ మాస బోనాలు.. అధికారులను ఆదేశించిన మంత్రులు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : ఈనెల 26 నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహించే ఆషాడ మాస బోనాలను అంగ రంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లు అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీ తుంగభద్ర బ్లాక్ లో మంగళవారం ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ 20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఉత్సవాలు ఈనెల 26 న ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుందని, జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలలో ఆషాడ బోనాలను లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని అందులో దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, మిగిలిన 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. ఏనుగు అంబారీ ఊరేగింపు జూలై 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో,20 న శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం సబ్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం అంబారీ ఏనుగు ఊరేగింపు ఉంటుందని తెలిపారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రధాన దేవాలయాల వద్ద రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని, దేవస్థాన పరిసరాలు పరిశుభ్రంగా, హైజెనిక్ గా ఉండేలా శానిటేషన్ పనులు చేపట్టాలని, దేవాలయాల చుట్టూ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి అధికారులను మంత్రులు ఆదేశించారు. భక్తులకు రక్షిత మంచినీరు అందించాలని, నీటి ప్యాకెట్లు పంపిణీ చేయాలని, ప్రధాన ఆలయాల వద్ద నేటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని హెచ్ ఎం డబ్ల్యూ, ఎస్ అండ్ ఎస్ బి అధికారులను ఆదేశించారు . బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, దేవాలయాల వద్ద భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఐసిడిఎస్ సహకారంతో అందించాలని సూచించారు.

అగ్నిమాపక శాఖ అధికారులు ముందుగా దేవాలయాల్ని సందర్శించి తదుపరి ప్రణాళిక ప్రకారం సిబ్బందితోపాటు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో దేవాలయాలు ఇతర ప్రాంతాల్లో భారీ కేట్లతోపాటు , వాటర్ ప్రూఫ్ జనరేటర్లు, షామియానాలు అలాగే మ్యాట్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించటం జరుగుతుందని పేర్కొన్నారు.

బోనాల ఉత్సవాల లలో 700 మంది కళాకారులచే సంస్కృతి కార్యక్రమాలు, ప్రదర్శనలు అద్భుతంగా చేపట్టనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.40 దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అమ్మవారి ఊరేగింపులో కళా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆషాడ బోనాలు ఢిల్లీ తో పాటు విజయవాడలో కూడా నిర్వహించనున్నట్లు అలాగే భ్రమరాంబ శ్రీశైలం దేవాలయాలను కూడా బోనాల ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పరిశీలించాలని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పై సత్వరమే స్పందించాలని పోలీస్ అధికారులను మంత్రులు ఆదేశించారు.

దేవాలయాలకు ఇచ్చే చెక్కులు రెవెన్యూ ,ఎండోమెంట్ విభాగాల అధికారులు కోఆర్డినేట్ చేసుకొని పండుగలకు ముందే పూర్తి చేయాలన్నారు . ప్రజల భాగస్వామ్యంతో దేవాలయ నిర్వాహకులతో ఆషాడ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.అనంతరం దేవాలయాల కమిటీలతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , డీజీపీ జితేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, అడిషనల్ డీజీ ఎం ఎం భగవత్, జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, టీఎస్ఎస్ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి ఎస్ జగన్ వివిధ శాఖల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story