- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asanna: మా శవాలు వస్తే ఎర్ర జెండాలతో ఊరేగిద్దామనా? .. కోవర్టు ఆరోపణలకు ఆశన్న కౌంటర్
కోవర్టు ఆరోపణలపై ఆశన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణలకు రూపేశ్ అలియాస్ సతీశ్ అలియాస్ ఆశన్న (Asanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావోయిస్టు పార్టీలో కోవర్టులుగా పని చేశామంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు తమ పరిధి దాటి తమపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బతికుండగా తీసుకున్న నిర్ణయమే సాయుధపోరాట విరమణ అన్నారు. ఇందులో మాకు ఎలాంటి స్వార్థం లేదని త్వరలోనే మా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. పోలీసుల వద్ద తమ అనుచరలుతో సరెండర్ (Maoist surrender) అయిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు విప్లవద్రోహులు, వారు పార్టీకి నష్టం కలిగించారని మావోయిస్టు పార్టీ చేసిన స్టేట్ మెంట్‍పై తాజాగా ఆశన్న స్పందించారు. ఈ మేరకు లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు.
రెండు విధాలుగా అనుకున్నాం:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎవరు బయటకు వచ్చినా వారిని ద్రోహులు అనడం పరిపాటి అని ఈ విషయంలో తాము స్పందించాల్సిన అవసరం లేదని భావించాం. కానీ ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన నష్టాలన్నింటికీ తామే బాధ్యులమని, తాము కోవర్టులుగా పని చేశామనే ఆరోపణలు చేశారని దీనికి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకునే ఈ వీడియో చేస్తున్నట్లు ఆశన్న తెలిపారు. అడవుల బాటను వదిలే ప్రక్రియ నిర్ణయం ఎలా ఉండాలి అనేది చర్చకు వచ్చినప్పుడు అది సాయుధపోరాట విరమణ రూపంలోనా లేక శాంతి చర్చల రూపంలోనా అని రెండు విధాలు చర్చకు వచ్చిందన్నారు. అయితే వీటిలో సాయుధపోరాట విరమణ రూపంలోనే బయటకు రావాలని నిర్ణయించామన్నారు. ఇదంతా ఏప్రిల్-మే నెలలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ దాదా (నంబాళ్ల కేశవరావు) బతికున్నప్పుడే ఆయన నాయకత్వంలోనే చర్చించామన్నారు. కానీ చనిపోయిన నంబాళ్ల కేశవరావు (Namballa Kesava Rao) మళ్లీ తిరిగి వచ్చి చెప్పలేరు కాబట్టి కొంత మంది ఏదేదో రాస్తున్నారని విమర్శించారు.
ఆ లేఖ ఎందుకు బయటకు రావడం లేదు?
మాతో పాటు బయటకు వచ్చిన వారంతా బలవంతంగా బయటకు రాలేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి తుపాకులు వదిలిపెట్టాలని గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగా బయటకు వచ్చారని ఆశన్న చెప్పారు. మల్లోజుల, ఆశన్న చెబితే విని వచ్చిన వారు కాదన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని బయటకు వచ్చినవారన్నారు. లొంగుబాటు ప్రక్రియ సీసీ నాయకులందరికీ తెలిసిందే అని, అయితే ఈ విషయంలో దక్షిణ వైపు ఉన్న నాయకులకు సమాచార లోపం ఉందని చెప్పారు. సాయుధపోరాట విరమణ విషయంలో నంబాళ్ల కేశవరావు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటూ ఇప్పుడు కొంత మంది అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. మే 18న నంబాళ్ల తన చివరి లేఖ పంపించిన తర్వాత ఆయన ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. ఈ ఎన్‍కౌంటర్ జరిగిన కొద్ది రోజులకు తాను దేవ్ జీతో పాటు సీసీ నాయకులను కలిశానన్నారు. తనకు అందిన నంబాళ్ల లేఖను నేను వారికి చూపించానని తెలిపారు. సాయుధపోరాట విరమణ విషయంలో మనం ఏమైనా తప్పు చేశామా? అని నా సందేహాలపై ఆ లేఖలో దాదా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. పార్టీని, విప్లవ ఉద్యమాన్ని కాపాడుకోవాలని మనం అనుకున్నామని అందులో రాశారని చెప్పారు. మనం ఏ తప్పు నిర్ణయం తీసుకోలేదని సరైన రీతిగానే వ్యవహరించామని పేర్కొన్నారన్నారు. నంబాళ్ల కేశవరావు సాయుధపోరాట విరమణ విషయంలో సీసీ నాయకులకు రాసిన లేఖపై సమీక్ష చేస్తే బాగుండేదని కానీ మే 13న పంపిన ఆ లేఖ ఇంకా బయటకు రాలేదన్నారు. ఈ లేఖను మల్లోజులకు కూడా ఇవ్వలేదన్నారు. ప్రధాన కార్యదర్శి రాసిన ఈ లేఖను ఒకరిద్దరు చదువుకుని మిగతా సీసీ సభ్యులకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ లేఖను ఇతరులకు ఇవ్వకపోవడంతోనే నంబాళ్ల ఈ లేఖలో ఏం చెప్పి ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. నంబాళ్ల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అనే అర్థంలో ఇప్పుడు చెబుతున్నారని కానీ అమరుడు అయ్యేనాటికి దాదా ఇదే నిర్ణయంపై ఉన్నారన్నారు.
మాలో విప్లవతత్వం ఇంకా మిగేలే ఉంది:
ఎవరి అనుతి తీసుకోకుండా చెప్పపెట్టకుండా బయటకు వచ్చామనేది పూర్తిగా వాస్తవం కాదన్నారు. సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ మీటింగ్స్ జరిగే పరిస్థితులే లేవన్నారు. ఇంతకాలం మా ఆచరణ ఏంటి? ఈ ఆచరణ అంతా వదిలేసేలా ఏ స్వార్థం మమ్మల్ని ఇలా చేయిస్తోందని ప్రశ్నించారు. మాలో ఇంకా విప్లవతత్వం ఉందని మేమేమి పూర్తిగా దిగజారి పోయి వ్యవహరించడం లేదన్నారు.నంబాళ్ల కేశవరావు ఉండగా ఈ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమా దీనికోసం ప్రయత్నం చేద్దామన్నారు. ప్రజాస్వామికవాదులు అనుకునే టీమ్ ఈ పని చేయదని, వాళ్లకు ఆ నిజాయితీ లేదని వారు ఆ పని చేయరన్నారు. మనం పార్టీవైపు నుంచే చేద్దామని మనకు ఎవరైనా సహకరించేవారు ఉంటే వారి మద్దతు తీసుకుందామన్నారు. మమ్మల్నీ నమ్మకపోతే మీరే చేయండి అన్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని ఏవిషయంలోనేనా స్పష్టత కోసం ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భయటపడేది లేదన్నారు. మేము తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని 99 శాతం మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అడవుల్లో ఉంటే ప్రజల అభిప్రాయాలేంటో తెలియడం లేదన్నారు. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా మరింత బలహీన పర్చాలనే అభిప్రాయం కూడా లేదన్నారు.
మా శవాలతో ఎర్ర జెండా ఊరేగింపులు చేద్దామనా?
పార్టీ తానా అంటే తందానా అనేలా బయట కొంత మంది తయారయ్యారని ఆశన్న విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు, మానవ హక్కుల సంఘం పేరు మీద ఉన్నవారు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. పౌర హక్కుల సంఘం వారు ఏ నిర్ధారణ లేకుండా మాట్లాడటం సరైనదేనా? మేము అందుబాటులోనే ఉన్నాం కదా? మమ్మల్ని కలిసి నిర్ధారణ చేసుకోవచ్చు కదా అని అన్నారు. అందరు చనిపోతే మేమెట్ల బతికామనేదే కదా మీ ప్రశ్న.. నాతో పాటు బయటకు వచ్చిన వారిని, ఇంతకాలం మేము ఉన్న ప్రాంతంలోని ప్రజలను కలిసి నిర్ధారణ చేసుకోవాలన్నారు. నేను ఎలా బతికాను, నన్ను ఎలా బతికించుకున్నారు, ఏయే ప్రమాదాల నుంచి బయటపడ్డానో వాళ్లే మీకు చెప్తారన్నారు. గడ్డం లక్ష్మణ్ ను గతంలో గౌరవించామని ఇప్పుడూ గౌరవిస్తున్నామన్నారు. కానీ వేదికలు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదన్నారు. పౌరహక్కుల సంఘంలో ఉండి మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు మీరు చేస్తు్న్నది ఏమిటి? మీ పరిధి ఏమిటి? పార్టీ అంతర్గత విషయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇరుపక్షాల వాదనలు విని ఓ నిర్ధారణకు రావాలి కదా అన్నారు. హైదరాబాద్ లో కూర్చున్న బుద్ధిజీవులు ఆయుధాలే ముఖ్యం అంటున్నారు. కానీ ఇక్కడున్న వాళ్లు తెలంగాణ వారు. మా శవాలు వస్తే ఎర్రజెండాలు పట్టుకుని ఊరేగింపులు చేద్దామనే కదా అని ఆశన్న ప్రశ్నించారు. దారులన్నీ ముూసుకుపోయినప్పుటు ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేద్దామని ప్రశ్నించారు. విజ్ఞతతో వ్యవహరించాలి తప్ప మూర్ఖంగా మాట్లాడవద్దన్నారు. మేము ఎలాంటి స్వార్థానికి లోను కాలేదని మాలో ఇప్పటికీ విప్లవతత్వం ఉందని, ప్రజల్లో పని చేయాలని కోరుకుంటున్నామని మమ్మల్నీ నమ్మాలన్నారు. ప్రజల పోరాటంలో పాలుపంచుకుంటామన్నారు. పరిస్థితులకు తగినట్లు వ్యవహరించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అనేక మంది సలహాలు ఇస్తున్నారని వారందరి సహకారం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.






