- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి : ఎంపీ అరవింద్
పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.

- ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం విఫలం
- సిటీ సమస్యలు పక్కకు పెట్టి ప్యూచర్సిటీ గురించి చెప్పడం విడ్డూరం
దిశ, తెలంగాణ బ్యూరో : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని సూచించారు. వరి కోతలు ప్రారంభమయ్యే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమై కేంద్రంపై నెపం మోపడం సరికాదని విమర్శించారు.
దొంగ ఇసుక, మట్టి రవాణా కోసం ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో ఉంటే, రైతుల ధాన్యాన్ని తరలించేందుకు మాత్రం కొరత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ధాన్యాన్ని ఇళ్ల ముందు కుమ్మరిస్తామనడం రైతులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంత పంట ఉత్పత్తి అవుతుందో ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కూడా తన రియల్వ్యాపారాల కోసమేనని, ప్రస్తుతం ఉన్న నగర సమస్యలను పరిష్కరించకుండా కొత్త నగరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి, గ్రామీణ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రం ముందు బలమైన వాదన వినిపించలేదని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






