- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్‌లో ఏఐ ల్యాబ్... వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం
వైద్య పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ద్వారా రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. భీరప్ప పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య పరిశోధనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ద్వారా రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. భీరప్ప పేర్కొన్నారు. నిమ్స్ లో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఒక ఏఐ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిమ్స్ వేదికగా ట్రాన్స్లేషనల్ ఏఐ ఫర్ నెట్వర్క్డ్ యూనివర్సల్ హెల్త్ కేర్ (టి.ఎ.ఎన్.యు.హెచ్) ఫౌండేషన్ ప్రతినిధులు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి) సభ్యులతో సోమవారం నిమ్స్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. పరిశోధనలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, రోగికి వైద్య సేవలు అందించేంత వరకు చేరినప్పుడే వాటికి అసలైన సార్థకత లభిస్తుందన్నారు. టి.ఎ.ఎన్.యు.హెచ్ సహకారంతో వాస్తవ క్లినికల్ వినియోగాల ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి సంప్రదాయ పరిశోధనను దాటి, వాస్తవ క్లినికల్ వినియోగాల ద్వారా రోగుల సంరక్షణను మెరుగుపరచడంపై దృష్టి సారించిన సంస్థ టి.ఎ.ఎన్.యు.హెచ్ అని తెలిపారు. నిమ్స్ ఆవరణలో సొంతంగా ఒక ఏఐ ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు టి.ఎ.ఎన్.యు.హెచ్ హామీ ఇచ్చిందని, దీనివల్ల నిమ్స్ పరిశోధనా సామర్థ్యం మరింత పెరుగుతుందని ఆయన వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంచనా వేసేందుకు ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ టూల్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్, రక్తనాళ సంబంధిత వ్యాధుల నిర్వహణలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. బహుళ కేంద్ర ఏఐ ఆరోగ్య పరిశోధనలు, క్లినికల్ డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్ వంటి రంగాల్లో ఐ.ఐ.ఎస్.సి నిపుణులతో కలిసి నిమ్స్ వైద్యులు పని చేస్తారని పేర్కొన్నారు.
రోగులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా క్లినికల్ పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు రెండు సంస్థలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి అంగీకరించాయని, ఈ ప్రక్రియ త్వరలోనే అధికారికంగా పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఐ.ఐ.ఎస్.సి నుంచి ప్రొ. సుందర్ స్వామినాథన్, ప్రొ. ఫణీంద్ర కె. యలవర్తి, ప్రొ. జయ ప్రకాశ్, ప్రొ. భాస్కరరావు చింతాడ తదితర నిపుణులు పాల్గొన్నారు. నిమ్స్ తరపున డీన్ డా. లిజా రాజశేఖర్, వివిధ విభాగాల అధిపతులు డా. పద్మజ దుర్గ, డా. శాంతవీర్ జి ఉప్పిన్, డా. శ్రీభూషణ్ రాజు, డా. సుభ లక్ష్మి, డా. సుజాత పట్నాయక్ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యం, రేడియాలజీ, క్యాన్సర్ విభాగాల్లో ఏఐ వినియోగంపై బ్రేకౌట్ సెషన్లలో లోతైన చర్చలు జరిగాయి.






