రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్”

by Naga Rani Yarlagadda |

రోడ్డు భద్రతపై "అర్రైవ్ అలైవ్" అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు.

రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్”
X
  • ‘సేఫ్టీ కనెక్ట్’ అనే ఏఐ యాప్ వినియోగించాలి
  • డిసెంబర్ నెలలో 15 రోజులపాటు నిర్వహణ
  • రాష్ట్రంలో అనుసరించాల్సిన అంశాలు రూపొందించాలి: బి.శివధర్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డు భద్రతపై "అర్రైవ్ అలైవ్" అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రత నిపుణులతో డీజీపీ కార్యాలయంలో సమావేశం శనివారం నిర్వహించారు. ప్రతి వాహన డ్రైవర్‌ ‘సేఫ్టీ కనెక్ట్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ను ఉపయోగించాలని డీజీపీ సూచించారు. ఈ యాప్ డ్రైవింగ్ విధానాన్ని పర్యవేక్షించి, భద్రతా ప్రమాణాలను పాటించేందుకు సహకరిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య, ప్రతి సంవత్సరం వివిధ సంఘటనలలో హత్యలకు గురయ్యే వారి సంఖ్య కన్నా పదిరెట్లు ఎక్కువగా ఉందని డీజీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్” రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం డిసెంబర్ నెలలో 15 రోజులపాటు నిర్వహించనున్నామని తెలిపారు. నవంబర్ 16 వ తేదిన జరిగే ప్రపంచ రోడ్డు భద్రతా బాధితుల స్మారక దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నామన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలని అన్నారు. పోలీసు శాఖ, రవాణా శాఖ, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నవంబర్ 9 లేదా 10న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని డీజీపీ సూచించారు.

వివిధ ప్రాంతాల్లో అమలులో ఉన్న రోడ్డు భద్రతకు సంబంధించి ఉత్తమ విధానాలను పరిశీలించి, తెలంగాణలో అనుసరించదగిన మార్గాలను రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ జారీకి ముందు డ్రైవర్‌లకు తప్పనిసరిగా డ్రైవింగ్ విద్యా శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఆ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతా విద్యను పాఠ్యాంశంగా చేర్చటం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు రోడ్డు భద్రతా పార్కులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీజీపీ మహేష్ ఎం.భగవత్, ఏడీజీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐజి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, డా. ఎం.రమేశ్, కె.రమేశ్ నాయుడు, జాయింట్ సీపీ ట్రాఫిక్, హైదరాబాద్‌ సిటీ డి.జోయెల్ డేవిస్, తదితర అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి సేఫ్టీ కనెక్ట్ ఫౌండర్ తన్మయి దీక్షిత్, మాల్కమ్ వోల్ఫ్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ టాప్ డ్రైవర్ నరేశ్ రాఘవన్, ఎచ్‌సీఎస్సీ వాలంటీర్ లోకేంద్ర సింగ్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ సూర్య, సివిల్ యాక్టివిస్ట్ వినయ వంగాల, రోడ్డు భద్రత నిపుణులు వినోద్ కనుముల తదితరులు పాల్గొన్నారు.

Next Story