బ్యాంకాక్ వెళ్తుండగా జర్నలిస్టుల అరెస్టు.. ఇప్పటి వరకు స్పందించని పోలీసులు.. అసలేం జరుగుతోంది?

by Prasad Jukanti |

మహిళా ఐఏఎస్ పై కథనం వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది.

బ్యాంకాక్ వెళ్తుండగా జర్నలిస్టుల అరెస్టు..  ఇప్పటి వరకు స్పందించని పోలీసులు.. అసలేం జరుగుతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో/ శంషాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్, మంత్రిపై వచ్చిన కథనాల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ చానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై హైదరాబాద్‍లో సీసీఎస్‍లో కేసు నమోదు కాగా ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ఈ కేసులో ఎన్‍టీవీ యాజమాన్యం మంగళవారం సాయంత్రం క్షమాపణలు కోరింది. దీంతో ఈ సమస్య ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ గత అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్ నమోదైంది. కుటుంబంతో విదేశాలకు వెళుతున్న NTV ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్‍ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అదే చానల్‍కు చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్టు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా నేరుగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు టీవీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.

అజ్ఞాతంలో యాజమాన్యం!

పండగ పూట రిపోర్టర్ల అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పరిణామాలతో ఛానల్ యజమాన్యం నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తే ఈ వార్తను ఎన్టీవీ కనీసం టెలికాస్ట్ కూడా చేయడం లేదని సొంత ఉద్యోగులు అరెస్టు అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువువులను చేయబోతున్నారా అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరుగుతోంది?:

మహిళా ఐఏఎస్ పై కథనం విషయం ప్రస్తుతం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఓ మంత్రిని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వంలోని పెద్దలే ఈ కథనాలకు ఆజ్యం పోశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇంతలోనే ఓ న్యూస్ చానల్ కు సంబంధించిన రిపోర్టర్లను అరెస్టు చేయడంంతో ఇది జర్నలిస్టులపై సర్కార్ కక్ష సాధింపు చర్యలు అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే ఈ అరెస్టులపై ఇటు పోలీసులు అటు సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కేసులో ఏం జరుగుతోంది అసలు వాస్తవాలు ఏమిటి అనేది పోలీసులు, సదరు న్యూస్ చానల్ సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story