టీచింగ్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు : శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

టీచింగ్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు : శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వివరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నాం. పేదలకు జీవిత బీమాను అందించి పేదల్లో ధీమా కల్పించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం’ అని తెలిపారు. ఆరోగ్య శ్రీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సరైంది కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్య, వైద్య రంగాల బడ్జెట్ లో కోత పెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు.

పేదల వైద్యం కోసం రూ.4,500కోట్లు..

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 నెలలో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ.2046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.2,400 కోట్లు మొత్తంగా రూ.4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 6వ డిసెంబర్ 2023 వరకు గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సగటున రూ.52 కోట్లు ఖర్చు పెట్టిందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సగటున ప్రతి నెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిల భారాన్ని మాపై పెట్టిందని, గత ప్రభుత్వం నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీలో వారసత్వంగా వచ్చిన భారం రూ.600.27 కోట్లు ఉందని, అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.360.16 కోట్ల బకాయిలు ఉందని గుర్తు చేశారు. ఆ భారాన్ని మోస్తూనే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు రూ.2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించామని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,480.52 కోట్లు చెల్లించామని, నెలకు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.34 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.54 కోట్లు అందించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం రూ. 725.75 కోట్ల బకాయిలు ఉంటే, అందులో గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన మొత్తం రూ.600 కోట్లు, గడిచిన 27 నెలల కాలంలో ఈ ప్రభుత్వ బకాయిలు కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉందని, ఇందులోనూ ప్రభుత్వ ఆసుపత్రులకే ఎక్కువగా రూ.496.31 కోట్లు బకాయిలు ఉంటే, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.231.44 కోట్లు ఉందని వివరించారు.

టీచింగ్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ రోగులు..

రోగులు ఎక్కువగా వెళ్తున్న ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు లేరని, స్పెషలిస్టుల ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు రోగులు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు వైద్యం కోసం టీచింగ్ హాస్పిటల్స్‌కు పంపిస్తే తద్వారా అక్కడున్న నిపుణులైన వైద్యులతో చికిత్స అందించడానికి అవకాశాలతోపాటు వైద్య విద్యార్థులకు వృత్తిరీత్యా ఎంతో అనుభవం వస్తుందని, చికిత్స అందించే అనుభవం కలిగిన వైద్యులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వకపోవడం వల్ల చికిత్స అందడం లేదన్న వాదన వాస్తవం కాదన్నారు. సీఎంఆర్ఎఫ్ గతంలో ఎలా దుర్వినియోగ మైందో అందరికీ తెలిసిందేనని, అందుకని మరింత పారదర్శకంగా ప్రజాప్రతినిధులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి వీలు కల్పించామని చెప్పారు. విదేశాల్లో గొప్ప పేరు గడించిన వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వెసులుబాటును బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పేదలకు వారి సేవలను అందించడానికి వీలుగా మెడికల్ అండ్ హెల్త్ వెబ్‌సైట్ ద్వారా ఒక వేదికను రూపొందిస్తున్నామని వివరించారు. సమాజంలో వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రజలకు ఉపయోగపడే సూచనలను స్వీకరిస్తామని, ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యమేనని స్పష్టం చేశారు.

రోల్ మోడల్‌గా..

విద్య పరంగా నర్సరీ నుంచి పై స్థాయి వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, మంచి రోల్ మాడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. నిమ్స్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు 3 వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రితో కలిపి రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నామని, వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పేదలకు మరింత వేగవంతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆస్పత్రుల నిర్వహణ విధానంలో కూడా మార్పులు చేస్తున్నామని అన్నారు. వైద్యులకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల వైద్యంపై దృష్టి సారించలేని పరిస్థితులు ఉంటున్నాయని తెలిపారు. నిర్వహణ విభాగాన్ని వేరు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు.

Next Story