హెల్త్ కేర్ రోడ్ మ్యాప్‌తో ఆరోగ్య తెలంగాణ

by Malleboina Mahesh |

ఆరోగ్యం, విద్య, ఆదాయం.. ఈ మూడు అత్యంత కీలక అంశాలుగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపొందించింది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మెరుగైన విద్యను అభ్యసిస్తారు.

హెల్త్ కేర్ రోడ్ మ్యాప్‌తో ఆరోగ్య తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యం, విద్య, ఆదాయం.. ఈ మూడు అత్యంత కీలక అంశాలుగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపొందించింది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మెరుగైన విద్యను అభ్యసిస్తారు. చదువుకున్న యువత ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకంగా పాల్గొంటారు. అధిక ఆదాయం మంచి జీవన ప్రమాణాలకు, స్థిరత్వానికి దోహదం చేస్తుందని సర్కారు భావిస్తోంది. అందుకే విద్య, ఆరోగ్యం, పోషణ, సంక్షేమ రంగాల్లో వ్యవస్థల సమన్వయం ద్వారా ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన, భద్రతతో కూడిన జీవితం గడపాలనే దీర్ఘకాల దృష్టితో ఈ దార్శనిక పత్రం సిద్ధమైంది. 2047 నాటికి ప్రతి పౌరుడు దీర్ఘకాలం, ఆరోగ్యంగా, గౌరవంగా జీవించేలా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంపై దృష్టి సారిస్తోంది.

ఈ లక్ష్య సాధనలో శిశు పోషణ, బాలింతల ఆరోగ్యం, యువతకు సదుపాయాలు, రోగాల నియంత్రణ, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్యానికి పెద్ద ఎత్తున పెడుతున్న పెట్టుబడులతో ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఇదంతా కలిపి తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ఈ విజన్ డాక్యుమెంట్‌లోని ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి.

వైద్య, ఆరోగ్య రంగంలో నూతన దిశ..

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఇప్పటికే సాధించిన పురోగతిని మరింత విస్తరించేందుకు సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ప్రసవాలు, టీకాలు, ఆరోగ్య సేవలకు మరిన్ని అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా తృతీయ శ్రేణి వైద్య సేవలు అందుబాటులోకి రావడం, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ-సంజీవని టెలికన్సల్టేషన్లు, ఈ–హెచ్‌ఎమ్ఐఎస్ వంటి డిజిటల్ వ్యవస్థలు నగర-గ్రామ ఆరోగ్య అంతరాన్ని తగ్గిస్తున్నాయి. మాతా-శిశు ఆరోగ్యం, సంక్రమణ జన్య వ్యాధుల నియంత్రణ, అత్యవసర వైద్య సేవల రంగాల్లో తీసుకున్న చర్యలు బలమైన పునాది వేసినప్పటికీ సవాళ్లు మాత్రం కొనసాగుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధులు వంటి అసంక్రమణజన్య వ్యాధులు పెరుగుతూ ప్రధాన మృతుల కారణాలుగా మారుతున్నాయి.

వృద్ధాప్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పులు, కొత్త సంక్రమణ వ్యాధులు వంటి అంశాలు ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశవ్యాప్త పథకాలైన పోషణ అభియాన్, అనీమియా ముక్త్ భారత్‌, ఆర్‌ఎమ్‌ఎన్‌సీఏహెచ్+ఎన్‌, ఆయుష్మాన్ భారత్–పీఎంజేఏవై, నేషనల్ హెల్త్ మిషన్, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, క్యాన్సర్-డయాబెటిస్-హృద్రోగ నియంత్రణ కార్యక్రమం, టీబీ నిర్మూలన కార్యక్రమం, మిషన్ ఇంద్రధనుష్‌, వన్ హెల్త్‌ ఫ్రేమ్‌వర్క్‌తో అనుసంధానంగా ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొల్పుతున్న అపూర్వమైన ఆరోగ్య మౌలిక వసతులు, వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఆధునిక నిర్ధారణ కేంద్రాలు, డిజిటల్ హెల్త్ వ్యవస్థలు, హైదరాబాద్‌ బయట కూడా ఉన్నత వైద్యసేవల వికేంద్రీకరణకు దోహదం చేస్తున్నాయి. ప్రతి పౌరునికి ఆరోగ్య సేవలు అందిస్తూ 2047 నాటికి ‘ఆరోగ్య తెలంగాణ’ను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

హెల్త్ రోడ్‌ మ్యాప్- ఆరు ప్రధాన అంశాలు..

తెలంగాణ విజన్-2047 ను సాధించేందుకు ప్రభుత్వం ఆరు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తోంది. ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌‌తో పాటు జాతీయ ఆరోగ్య పథకాలతో స్పష్టంగా అనుసంధానించబడ్డాయి.

1. పోషకాహార లోపం లేకుండా..

రాష్ట్రం విడుదల చేసిన దీర్ఘకాలిక ఆరోగ్య లక్ష్యాల్లో పోషకాహార లోపాల నిర్మూలన ప్రధానంగా ఉంది. 2025లో 33 శాతంగా ఉన్న పోషకాహార లోపాన్ని 2047 నాటికి 12శాతం కంటే దిగువనకు తగ్గించేందుకు, మహిళల్లో అనీమియా ప్రస్తుతం 58శాతం కాగా... 2047 నాటికి 15శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అనీమియా రహిత తెలంగాణే లక్ష్యం. ఇందుకే గర్భిణీ-బాలింతలకు పోషకాహార కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయం. 100శాతం సురక్షిత తాగునీరు అందించడం, డిజిటల్ గ్రోత్ మానిటరింగ్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్‌నూట్రిషన్ యూనిట్ల పంపిణీ లక్ష్యం.

2. మాతా శిశు సంరక్షణే ప్రధాన లక్ష్యం..

100 శాతం ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు, గర్భధారణ సమయంలో 4 సార్ల కంటే ఎక్కువగా ఆసుపత్రికి వెళ్లడం, హై రిస్క్ గర్భాల కోసం బయో సెన్సర్ల వినియోగం, ఏఐ పర్యవేక్షణ, సిజేరియన్ శాతం తగ్గించేందుకు రాబ్సన్ ఆడిట్లు, జన్యు, మెటబాలిక్ స్క్రీనింగ్ పెంచడం.

3. బాలలు, కిషోర బాలికల ఆరోగ్యం..

స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా విజన్, డెంటల్, మెంటల్ హెల్త్ పర్యవేక్షణ, మెనస్ట్రువల్ హైజీన్, ఐఎఫ్ఏ, డీ-వార్మింగ్, అడొలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్స్ (ఎ.ఎఫ్.హెచ్.సి) సేవలు అందించడం

4. అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు..

పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా దవాఖానలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయడం, ప్రతి నగరంలో బస్తీ దవాఖానలు, 100% అవసరమైన ఔషధాలు-డయగ్నస్టిక్స్, టీ-డయాగ్నోస్టిక్స్, మొబైల్ డయగ్నస్టిక్స్, మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్లు అందుబాటులో ఉంచడం

5. జీవనశైలి కారణంగా వచ్చే రోగాలపై పోరాటం..

30+ ఏళ్ల వారికి యూనివర్సల్ స్క్రీనింగ్, డయాలిసిస్ విస్తరణ, జిల్లా స్థాయి డే-కేర్ కెమోథెరపీ, ఏఐ ఆధారిత వ్యాధి ముందస్తు గుర్తింపు

6. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..

ప్రతి జిల్లాలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్పీ), పీహెచ్సీ స్థాయిలో కౌన్సిలర్లు, 24×7 సూసైడ్ హెల్ప్‌లైన్, డీ-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా జీవనశైలి వ్యాధులపై పోరాటం

వైద్య, ఆరోగ్య రంగం పురోభివృద్ధికి కీలకమైన అంశాలు..

1. ఆరోగ్య రంగంలో భారీగా పెట్టుబడులు..

రూ. 25వేల కోట్లతో మెడికల్ కాలేజీలు, టెర్రిటరీ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, రూ.9400 కోట్లతో టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు, రాష్ట్రంలో అదనంగా మొత్తం 9 వేల పడకల ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. పబ్లిక్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధుల వినియోగం, జిల్లాల వ్యాప్తంగా తృతీయ శ్రేణి దవాఖానలు, మెడికల్ కళాశాలలు, డయాగ్నస్టిక్ సౌకర్యాలు, పేషెంట్ ఫ్రెండ్లీ హెల్త్ సర్వీసుల విస్తరించేలా ప్రణాళిక. అధునాతన క్యాన్సర్ కేర్, ట్రామా వ్యవస్థల ఏర్పాటు. మహిళా శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ ఇంటిగ్రేషన్, హైఎండ్ పరికరాల కోసం గ్లోబల్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం ద్వారా వ్యక్తిగత ఖర్చులు తగ్గి, ఉత్పాదకత పెరగడం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఆరోగ్య ఫలితాలకు అవకాశం కలగనుంది.

2. డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

పబ్లిక్ ప్రైవేటు రంగాలన్నింట్లో ఏకీకృత ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులతో కూడిన అభా (ఏబీహెచ్ఏ)ఆధారిత డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌లు అందుబాటులోకి తీసుకురావడం, స్కాన్ అండ్ షేర్ ఓపీడీ, ఈ-హెచ్ఎంఐఎస్, హెచ్ఎఫ్ఆర్, హెచ్పీఆర్, మెడ్లా పీఆర్ ద్వారా మెడికో-లీగల్ వ్యవస్థల డిజిటలైజేషన్. గుండె జబ్బులు, క్యాన్సర్, హై రిస్క్ గర్భధారణలు, సెప్సిస్ గుర్తింపు వంటి వ్యాధి నిఘా కోసం ఏఐ మాడ్యూల్స్ వినియోగం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, వన్-హెల్త్ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలతో వైద్య రంగంలో కొత్త పుంతలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

3. హెల్త్ వర్క్‌ఫోర్స్ స్కిల్లింగ్..

నర్సింగ్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, స్కిల్ ల్యాబ్‌ల ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు పెంచేందుకు విదేశీ భాషల్లో (జర్మన్, జపనీస్, ఇంగ్లీష్) శిక్షణ అందించడం. నిమ్స్ సహా వివిధ ఆసుపత్రుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్థాపించడం.

4. హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్..

డయాగ్నస్టిక్స్, డయాలిసిస్, ఐవీఎఫ్, ఆంకాలజీ, ట్రామా చికిత్సలపై వ్యక్తిగత ఖర్చులను తగ్గించేందుకు చర్యలు, ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీ-జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ఏబీ- పీఎంజేఏవైలను ఏకీకరించిన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు, అవయవాల సేకరణ నెట్‌వర్క్‌లు, అత్యవసర ట్రామా ఫైనాన్సింగ్‌ను బలోపేతం చేయడం వంటి చర్యలు.

Next Story