మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-25 08:02:39  IST  )

తెలంగాణ (Telangana)లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే.

మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్‌, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈ నెల 23 వరకు పొడిగించింది. అయితే, దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ పలువురు మద్యం వ్యాపారులు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్లపై ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారంజీ (Justice N Tukaranji) తీర్పును రిజర్వు చేశారు. వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది టెండర్ల గడువు ఏ నిబంధన ప్రకారం పొడిగించారో చెప్పాలన్నారు. అయితే, టెండర్లపై పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఏఏజీ సమర్పించారు. అదేవిధంగా మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీసుకొవచ్చి కోర్టు స్పష్టం చేసింది. తీర్పునకు లోబడే మద్యం దుకాణాలు లైసెన్స్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఓ వైపు ప్రభుత్వం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆసక్తిగా చూస్తుంటే.. మరోవైపు గడువు తర్వాత మద్యం షాపులకు దరఖాస్తు చేసిన ఆశావహుల్లో తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

అయితే, గత వాదనల సందర్భంగా జస్టిస్ ఎన్ తుకారంజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మద్యం దరఖాస్తుల గడువు పెంపునకు చట్టబద్ధత ఉందా.. అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని కామెంట్ చేశారు. చట్ట విరుద్ధంగా గడువు పెంచితే దరఖాస్తులు రద్దు చేయాల్సి ఉంటుందని జస్టిస్ తుకారం‌జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసులో తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. మరోవైపు మద్యం దుకాణాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story