పాకిస్తాన్‌కు భక్తులా? ఆఫ్గనిస్తాన్‌కా? మజ్లిస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ ఫైర్

by Bhoopathi Nagaiah |

తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

PM Modi No Need to Answer to CM KCR, Says Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. వారు పాకిస్తాన్‌కు దేశభక్తులా? ఆఫ్ఘనిస్తాన్‌కా? అని బండి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, కరీంనగర్‌లో ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం కార్యకర్తలు తన ఇల్లు, ఆఫీస్ పైకి ర్యాలీగా వెళ్తూ దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. తమ సహనాన్ని చేతగాని తనంగా భావిస్తే ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. ఈ రెండు పార్టీలు మతం రంగు పులిమి బీజేపీని బదనాం చేయాలని చూస్తున్నాయని ఆయన ఫైరయ్యారు.

పోలీస్ వ్యవస్థ కలుషితమైందని, కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఉంటూ బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని పైరయ్యారు. తమ ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే దారుస్సలాంపై జెండా ఎగురవేస్తామని, ఆ సత్తా తమకుందని, అనవసరంగా తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ఎంఐఎం అడ్డా అని చెప్పుకున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర తమదని బండి గుర్తుచేశారు. మజ్లిస్ ఆగడాలపై పోరాడుతూ అధికారంలోకి వస్తే ఓల్డ్ సిటీని.., న్యూసిటీగా చేద్దామనుకుంటున్న బీజేపీపై మతతత్వవాదిగా ముద్ర వేస్తారా అని బండి ధ్వజమెత్తారు. పాతబస్తీలోని ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను ఛీదరించుకుంటున్నారన్నారు. ఎంఐం దేశ ద్రోహుల పార్టీ అని, దేశ ద్రోహులు చస్తే సంతాప సభలు నిర్వహించే పార్టీ అని బండి ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు.

Next Story