Medaram: మేడారం అభివృద్ధి పనులు గిరిజనులకు వరమా శాపమా?

by Ramesh Naini |   (  Updated:2025-11-07 01:59:49  IST  )

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా రెండేళ్లకోసారి పాలకులు చేపడుతున్న అభివృద్ధి పనులు గిరిజనులకు లాభంగా మారుతున్నాయా లేక శాపంగా మారుతున్నాయా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

Medaram: మేడారం అభివృద్ధి పనులు గిరిజనులకు వరమా శాపమా?
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా రెండేళ్లకోసారి పాలకులు చేపడుతున్న అభివృద్ధి పనులు గిరిజనులకు లాభంగా మారుతున్నాయా లేక శాపంగా మారుతున్నాయా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన అనంతరం 2006 సంవత్సరం నుండి పాలకులు ప్రతి రెండేళ్లకోసారి కోట్లాది రూపాయలను కేటాయిస్తూ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతున్నది. 2006 ముందు గద్దెల ప్రాంతం తో పాటు మేడారం గ్రామంలో రోడ్డుగా చిన్నగా ఉండేది. ప్రతీ మహా మేడారం జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు 2024 లో జరిగిన జాతర సందర్భంగా కోటి 50 లక్షలు మంది భక్తులు రావడం, ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం చేసిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి స్థానిక శాసనసభ్యులు ధనసరి సీతక్క మహా జాతర దృష్టిలో ఉంచుకొని గద్దెల ప్రాంతాన్ని విస్తరణ చేసే పనులను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయించారు. అప్పటి నుండి గద్దెల ప్రాంతంలో చేపట్టిన పనులు వేగవంతం కాగా ఇదే సందర్భంలో ఊరట్టం గ్రామానికి వెళ్లే రహదారిలో నక్సల్స్ స్తూపం నుంచి మేడారం గ్రామ ప్రారంభ మూల మలుపు గల మూడు కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి రూ.41 కోట్లు కేటాయించగా పనులను ఒక గుత్తేదారుడికి అప్పగించారు. స్తూపం నుంచి జంపన్న వాగు వరకు చెట్లను తొలగించడంతోపాటు జంపన్న వాగు నుంచి మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహం వరకు రోడ్డుకు ఇరువైపులా నామమాత్రపు ఇండ్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.

గిరిజనులు అధికారులకు మధ్య ఘర్షణ

ఐటీడీఏ అతిథి గృహం నుంచి మేడారం గ్రామ ప్రారంభంలోని మూల మలుపు వరకు గల గిరిజనుల ఇండ్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడంతో కొద్ది రోజుల క్రితం గిరిజనులకు అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రోడ్డు విస్తరణ పనుల కారణంగా గిరిజనులకు కష్టకాలం ప్రారంభమైంది. తమ తాతల కాలం నుంచి ఇండ్లను నిర్మించుకొని జీవించడమే కాకుండా పలు రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న తమకు జీవనోపాధి లేకుండా పనులు చేపడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా రోడ్డు విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్య తొలిగిపోవడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. గిరిజనులు మాత్రం తమ ఇండ్లను కూల్చొద్దని పట్టుబడుతున్న క్రమంలో దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

నష్టపరిహారం అందించడం లేదు

ముఖ్యంగా ఇండ్ల స్థలాలను కోల్పోతున్న గిరిజనులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారికి ఇతర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలను చూపించే కార్యక్రమాన్ని చేపట్టిన పక్షంలో వారు శాంతించే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయ పంటలను కోల్పోతున్న తమకు ఇలాంటి నష్టపరిహారం అందించడం లేదని, నేడు రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఇండ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని సమ్మక్క సారలమ్మ దేవతల ఆదివాసి (కోయ దొరల) పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఆదివాసి గిరిలకు నష్టం జరగకుండా పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story