- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీ అధికారులు నిద్ర పోతున్నారా?.. నాంపల్లి ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీఎం బృందం
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్ అబిడ్స్ లో బచ్చాస్ ఫర్నిచర్ షాప్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఘటనను సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ సందర్శించి పరిశీలించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్ అబిడ్స్‌లో బచ్చాస్ ఫర్నిచర్ షాప్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఘటనను సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ సందర్శించి పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందో పోలీసులు, స్థానిక నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ, ఫర్నిచర్ షాప్ దగ్ధం లో ఐదుగురు మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం బాధాకరమని అన్నారు. చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 20 ఏండ్లకు పైగా షాపులో పనిచేస్తున్న బేగం బీ అనే మహిళ, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన కార్మికులు ఇద్దరు దట్టమైన పొగకు ఊపిరాడక 2 సెల్లార్ల నుంచి బయటికి తీసుకు రాలేక ప్రాణాలు విడిచారని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని బచ్చాస్ ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బచ్చాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ, ఏడాది కాలంలోనే మూడు అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయని అన్నారు. గుల్జార్ హౌస్ లో ఏడుగురు, శాలిబండలో ముగ్గురు, తాజాగా నాంపల్లి లో ఐదుగురు మరణించారని చెప్పారు. ఫర్నిచర్ దుకాణాలు, బట్టల దుకాణాలు ఇరుకు గదుల్లో ఉంటున్నాయని, వాటికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతి ఇస్తున్నారని అన్నారు. సెల్లార్ పార్కింగ్ కోసం ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు నిద్ర పోతున్నారా? ప్రశ్నించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.






