నదుల అనుసంధానం పేరుతో ఏపీ కొత్త కుట్ర.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే సీఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను 'గురుదక్షిణ'గా ఇస్తున్నారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

నదుల అనుసంధానం పేరుతో ఏపీ కొత్త కుట్ర.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కేవలం బీఆర్ఎస్ చేసిన గట్టి పోరాటం వల్లే ఆగిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. నదీ జలాల దోపిడీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని నిద్రలేపేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఏపీ కొత్త ప్లాన్.. తెలంగాణకు తీవ్ర నష్టం

గతంలో ఏపీ ప్రభుత్వం వేసిన గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla), గోదావరి-నల్లమల్ల (Godavari-Nallamala) సాగర్ వంటి రెండు ప్లాన్లు విఫలమయ్యాయని హరీశ్ రావు గుర్తుచేశారు. తాజాగా నదుల అనుసంధానం పేరుతో ఏపీ మరో కొత్త కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. దీని ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, నేషనల్ ప్రాజెక్టు (National Project) కింద కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌లోకి సులభంగా మళ్లించుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాకుండా పోతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తెలంగాణకు చెందిన సమ్మక్క సాగర్ నుంచి 47 టీఎంసీల నీటిని కూడా పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గోదావరి నదిలో అసలు మిగులు జలాలే లేనప్పుడు, ఏపీ కొత్తగా ప్రాజెక్టులు ఎలా కడుతుందని ఆయన ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌పై ‘గురుదక్షిణ’ ఆరోపణలు

తెలంగాణకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ‘డూడూ బసవన్నలాలా’ తలలూపుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. తన రాజకీయ గురువైన చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, గోదావరి నీళ్లను ఆయనకు 'గురుదక్షిణ'గా ఇవ్వాలని చూస్తున్నారా అని ధ్వజమెత్తారు. దీనిపై సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తిట్లకు లంఘిస్తున్నారని, తాము మాత్రం ప్రశ్నించడం ఆపబోమని స్పష్టం చేశారు.

గతంలో బీఆర్ఎస్ పెట్టిన ప్రతిపాదనలు

తాము అధికారంలో ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్రం ముందు కొన్ని స్పష్టమైన ప్రతిపాదనలు పెట్టామని హరీశ్ రావు గుర్తుచేశారు. నీటిని ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్ నుంచి అది కూడా తెలంగాణ భూభాగం నుంచే తీసుకోవాలి, అప్పుడే తెలంగాణ కూడా ఆ నీటిని వాడుకునే వీలుంటుందన్నారు. అందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) కూడా ఒప్పుకుందన్నారు. కావేరీ నదికి తీసుకెళ్లే నీటిలో సగం వాటాను తెలంగాణకు ఇవ్వాలని చెప్పామని, గతంలో కేంద్రం కూడా ఆ ప్రతిపాదనలకు అంగీకరించిందని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణను కాదని పోలవరం నుంచి నీటిని మళ్లించేలా ఏపీ సీఎం చంద్రబాబు కావేరి-గోదావరి లింక్ రాగం అందుకున్నారని, దీనివల్ల తెలంగాణకు కోలుకోలేని నష్టం జరుగుతుందని హరీశ్ రావు హెచ్చరించారు.

Next Story