- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మెడికల్ రిక్రూట్‌మెంట్‌లో ‘డైరెక్ట్’ అన్యాయం
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వైద్య ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వైద్య ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ నెం.03/2025 విడుదలయ్యి ఏడాది గడుస్తున్నా.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా లాటరల్ అబ్సార్ప్షన్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. జీఓఎంఎస్ నం.154తో పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి 5 ఖాళీలలో 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగిలినవి ఆర్ఎంఓ, సీఎంఓ, డీహెచ్, టీవీవీపీ వైద్యుల ద్వారా భర్తీ చేయాలి. ఈ క్రమాన్ని పాటించకుండా ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం చట్టవిరుద్ధమని 2 వేల మందికి పైగా అభ్యర్థులు వాపోతున్నారు. కొందరు ఇన్-సర్వీస్ డాక్టర్లు నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బ్యాక్‌డోర్ ఎంట్రీలకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల మెరిట్ అభ్యర్థులకు నష్టం జరుగుతోందని కొందరు దిశకు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగులను అన్యాయం చేయవద్దు..
డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అభ్యర్థులుగా తాము గత ఏడాది జూన్ లో విడుదలైన నోటిఫికేషన్ నెం.03/2025 కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను దాదాపు ఏడాది అయినప్పటికీ పూర్తి చేయకుండా వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిరుద్యోగ వైద్యులు పేర్కొన్నారు. 2వేల మందికి పైగా అర్హత కలిగిన అభ్యర్థులు న్యాయమైన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయకుండా ముందుగా లాటరల్ అబ్సార్ప్షన్లను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచించడం పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధమని వాపోయారు. ఇది జీఓ ఎంఎస్ నం.154, ఏపీ మెడికల్ సర్వీస్ రూల్స్, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపారు. ఇది మెరిట్, పారదర్శకత, న్యాయానికి వ్యతిరేకంగా జరిగే చర్యగా పలువురు అభ్యర్థులు వాపోయారు. ఏడాది కాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం చేసి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కొద్ది మంది ఇన్-సర్వీస్ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం కొందరు అధికారుల తీరువల్లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇన్-సర్వీస్ డాక్టర్లు తమ ఎండీ, ఎంస్ పూర్తి చేసిన తర్వాత తప్పనిసరి ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేయకుండా, ప్రొబేషన్ లేదా రెగ్యులరైజేషన్ పూర్తి చేయకుండానే పైరవీల ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. ఇటువంటి బ్యాక్‌డోర్ మార్గాలను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో నియామక వ్యవస్థపై నమ్మకం పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రముఖ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా క్రమంగా ఇన్-సర్వీస్ అబ్సార్ప్షన్లకు కేంద్రాలుగా మారుతూ... మెరిట్‌ను నమ్ముకున్న నిరుద్యోగ వైద్యులను కాదని, కేవలం కొద్దిమందికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.






