- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదాయ శాఖలో 191 మందికి నియామక పత్రాలు
దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. అలాంటి దేవాలయాల వైభవాన్ని పరిరక్షించే బాధ్యతను నిర్వర్తించే అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, వాయిద్య కళాకారులు, దేవాలయ వంట సిబ్బంది సేవలు అత్యంత పవిత్రమైనవని మంత్రి పేర్కొన్నారు. ఎంతో అదృష్టం చేసుకుంటేగానీ దేవుని సేవలో తరించే భాగ్యం దక్కదని మంత్రి సురేఖ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 191 మంది ఉద్యోగులకు కొండా సురేఖ నియామక ఉత్తర్వులను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 47 ఆలయాలకు ఎంపికైన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులున్నారు. 191 మంది ఉద్యోగుల నియామకం చేపట్టడం తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఆలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. వీరిలో వారి వారి పరిధిలో నిర్వర్తించే బాధ్యతలు దేవాలయాల ఆధ్యాత్మిక వైభవాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
అర్చకుల దేవతారాధన, వేదపండితుల వేద పారాయణం, పరిచారకుల నిత్య కైంకర్య సేవలు, ఆధ్యాత్మికశోభను పెంపొందించే మృదంగ వాయిద్య కళాకారులు, దైవానికి నైవేద్యం, భక్తులకు ప్రసాదాన్ని సిద్ధంచేసే వంటవారు తదితర ఉద్యోగులంతా నిష్ఠతో వుంటేనే దేవాలయాల వైభవం, పవిత్రత, ప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ‘దేవాలయ ఉద్యోగమంటే ఉపాధి లేదా ఉద్యోగంగా భావించకుండా భగవంతుని సేవ చేసే అరుదైన అవకాశం, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే గొప్ప బాధ్యత అని మీరు భావించాలి. ఈ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వర్తించి భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టాలి’ అని మంత్రి సురేఖ నియామక ఉత్తర్వులందుకున్న ఉద్యోగులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను మరింత బలోపేతం చేస్తూ ఆలయాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, ఆగమ సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ అధికారుల సమిష్టి కృషితోనే దేవాదాయ శాఖ చరిత్రలోనే ఎన్నడూ చేపట్టని విధంగా 191 మంది మతపరమైన ఉద్యోగుల నియామకాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా దేవాలయాలకు ప్రత్యేకంగా భావించే రోజుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాలు చెప్పే విధంగా త్వరలో ఉత్తర్వులిస్తామని మంత్రి సురేఖ ప్రకటించారు. త్వరలో ఆయా గుళ్ళలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగస్తులకు పనితీరును బట్టి అవార్డులు ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించిందని, రాబోయే రోజులు గోదావరి, కృష్ణ నదీ పుష్కరాలను అదే స్థాయిలో నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఏళ్ళుగా పెండింగ్ లో వున్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోల ప్రమోషన్స్ చేపట్టామని, త్వరలో గ్రేడ్ 3 ఈవోల ప్రమోషన్ ను చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో వరుణయాగం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ యాగాల ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయా దేవాలయాల్లో పూజలు చేయాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖను దేవాదాయ ఉద్యోగులు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, స్టేట్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (సిటా) డైరక్టర్ విజయ రాఘవాచార్యులు, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ కృష్ణప్రసాద్, ఏడీసీలు శ్రీనివాస్, జ్యోతి, ఎసీ రామాల సునీత, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డీవీఆర్.శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, డాక్టర్ ఆర్. శ్రీరామ ఘనాపాటి, పలువురు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు






