Professor Beerappa: వైద్య రంగంలో అఫెరిసిస్ సేవలు కీలకం

by Gantepaka Srikanth |

మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో అఫెరిసిస్ ప్రక్రియ అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు.

Professor Beerappa: వైద్య రంగంలో అఫెరిసిస్ సేవలు కీలకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో అఫెరిసిస్ ప్రక్రియ అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. గురువారం నిమ్స్ ఆసుపత్రిలోని ఇమ్యునోహెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ విభాగం ఆధ్వర్యంలో అఫెరిసిస్‌లో అత్యుత్తమ సేవలు అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ.. గతంలో రక్తం అంటే కేవలం రక్తం ఇచ్చే ప్రక్రియ మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు అఫెరిసిస్ సాంకేతికత వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అఫెరిసిస్ అంటే.. దాత లేదా రోగి రక్తం నుండి కేవలం అవసరమైన భాగాలను (ప్లేట్‌లెట్స్, ప్లాస్మా లేదా కణాలు) మాత్రమే సేకరించి, మిగిలిన రక్తాన్ని తిరిగి దాత శరీరంలోకి పంపే అత్యాధునిక విధానమని ఆయన వివరించారు.

కిడ్నీ, నాడీ వ్యవస్థ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఈ ప్రక్రియ ప్రాణదాతగా మారుతోందని కొనియాడారు. నిమ్స్ డీన్ డా. లిజా రాజశేఖర్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో వైద్యులకు, సిబ్బందికి అఫెరిసిస్ యంత్రాలపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. చండీగఢ్ పీజీఐఎమ్మార్ నిపుణుడు డా. రట్టి రామ్ శర్మతో పాటు ఎయిమ్స్, సిమ్స్, ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల నుండి సుమారు 122 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో నిర్వహించిన సైంటిఫిక్ పోటీల్లో డా. స్వాతి (పోస్టర్ ప్రెజెంటేషన్), డా.కార్య (పేపర్ ప్రెజెంటేషన్) విజేతలుగా నిలిచారు. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగాధిపతి డా. సుధీర్ కుమార్ వుజ్జిని, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. బి. శాంతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. మహేష్ కుమార్, డా. మురళి కృష్ణ మరియు ఇతర వైద్య బృందం పాల్గొంది.

Next Story